Representative image
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. గతంలో భారత్ – పాక్ మధ్య 1947–1948, 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల సమయంలో మన సైనికులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 1971లో జరిగిన యుద్ధంలో ఓ మహిళ గూఢచారిగా పనిచేసి మన దేశ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆమె పేరు సెహ్మత్. ఈ కశ్మీరీ మహిళ ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని. 1969లో ఆమె తండ్రి కన్నుమూశారు. ఆయన భారత నిఘా సంస్థ “రా”కు చెందిన అధికారి. ఆ సమయంలో తండ్రి కోరిక మేరకు ఆమె అదే ఏడాది గూఢచర్యం వైపు దృష్టి సారించారు. ఆమె భారతదేశ నిఘా సంస్థ “రా”లో చేరి దేశం కోసం పనిచేశారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో గూఢచారిగా పనిచేయడానికి ఆమె పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. పాక్‌లోనే కొంతకాలం పాటు నివసించారు. ఆ సమయంలో సెహ్మత్ పాకిస్థాన్‌లోని సైనికుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.
భారతదేశ యుద్ధనౌక ఐఎస్‌ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలని, నీటిలో ముంచేయాలని కుట్రలు పన్నిన పాక్ ప్రణాళికతో పాటు మరింత కీలకమైన నిఘా సమాచారాన్ని తెలుసుకుని ఆమె భారత్‌కు అందించారు. దీంతో అప్రమత్తమైన భారత్.. పాక్ కుట్రలను తిప్పికొట్టింది.
ఆమె ఇచ్చిన సమాచారం పాకిస్థాన్ జలాంతర్గామి పీఎన్‌ఎస్ ఘాజీని భారత్ ధ్వంసం చేయడానికి ఉపయోగపడింది. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సెహ్మత్.. పాకిస్థాన్ నుంచి తిరిగి భారత్‌కు వచ్చే సమయానికి గర్భవతిగా ఉన్నారు.
అప్పటికే ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నారు. అనంతరం సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె గుర్తింపును భారత్ బయట పెట్టలేదు. ఆమె ధైర్యం, దేశభక్తి, త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
భారత్ 1971 యుద్ధంలో చరిత్రాత్మక విజయం సాధించడానికి ఆమె బాగా ఉపయోగపడ్డారు. ఈ వివరాలను రచయిత హరీందర్ సింగ్ సిక్కా తన నవల ‘కాలింగ్ సెహ్మత్’ లోనూ పేర్కొన్నారు.