విచారణకు రండి.. ఢిల్లీ మంత్రి అతిశీకి సమన్లు

AAP Atishi Summoned: బీజేపీ పరువు నష్టం కేసు వేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

AAP Atishi

ఢిల్లీ మంత్రి అతిశీకి ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ డబ్బు ఆశచూపుతోందంటూ అతిశి చేసిన కామెంట్లపై కాషాయ పార్టీ పరువు నష్టం కేసు వేయడంతో ఢిల్లీ కోర్టు ఆమెను జూన్ 29న విచారణకు రావాలని ఆదేశించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాల నిర్వహణ బాధ్యత అంతా అతిషి చూసుకుంటున్నారు. తాజాగా, అతిషి మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ తమ నేతలను కొనడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. అలాగే, మొత్తం ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ కూడా ఆరోపణలు చేశారు. ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ మొదటి నుంచి కొట్టిపారేస్తోంది.

ఆ తర్వాత కూడా అతిశి మరికొన్ని ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని అన్నారు. తనను బీజేపీలో చేరాలని కోరారని తెలిపారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని చెప్పారు.

పార్టీ మారకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోపు అరెస్టు చేస్తుందని వారు బెదిరించారని ఆమె తెలిపారు. దీంతో బీజేపీ పరువు నష్టం నోటీసులు పంపుతూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీనిపైనే ఇవాళ అతిశికి ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది.

Also Read: తెలంగాణ వ్యాప్తంగా రవాణ శాఖ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి..

ట్రెండింగ్ వార్తలు