AAP MP Sanjay Singh
Sanjay Singh: మణిపూర్‌లో అల్లర్ల అంశం లోక్ సభ, రాజ్యసభలను స్తంభింపజేస్తోంది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మణిపూర్ అంశంపై ప్రధానితో మాట్లాడించే వ్యూహంలో భాగంగా ‘ఇండియా’ కూటమి తరపున కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుసైతం లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడిన తరువాత తేదీని నిర్ణయిస్తానని ఆయన వెల్లడించారు.
Narendra Modi: మేము మూడోసారి అధికారంలోకి వచ్చాక…: మోదీ ఆసక్తికర కామెంట్స్
మరోవైపు.. మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. గత సోమవారం ఈ ఘటనపై సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. చైర్మన్ సంజయ్ సింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇందుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో నాలుగు రోజులుగా సంజయ్ సింగ్ నిరసన కొనసాగుతోంది. సస్పెన్షన్ అనంతరం పార్లమెంట్ వెలుపలే తన నిరసనను సంజయ్ సింగ్ కొనసాగిస్తున్నారు. మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కు వచ్చి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
మణిపూర్ మండిపోతోంది. ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా కూటమిని ఉగ్రవాద గ్రూపులతో పోల్చారు అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.