ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి రాజీనామా చేసినట్లు ప్రకటించిన వెంటనే ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్‌కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమెపై ఇప్పుడు వేటు పడింది. సెప్టెంబర్ 6వ తేదీన ఆల్కా లంబా ఆప్‌కు రాజీనామా చేస్తున్నట్టు ట్విటర్‌లో ప్రకటించారు.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అహంకారంగా వ్యవహరిస్తున్నాడని, అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. చాందినీ చౌక్ ఎమ్మెల్యే ఆప్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా ఆమెపై అనర్హత వేటు వేసింది ఆప్ పార్టీ.
ఢిల్లీ లోక్ సభ ఎన్నకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను అల్క లంబా బాహాటంగా కోరగా పార్టీలో ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పారు కొందరు నాయకులు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా ఆమెను తొలగించారు.
అదేవిధంగా కేజ్రీవాల్ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాలు జరగడంతో పొమ్మనలేక పొగపెట్టారంటూ అల్క లంబా ఆరోపణలు చేసింది. దీంతో ఆప్ తీరును విమర్శిస్తూ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనంటూ పార్టీకి రాజీనామా చేసింది.