Varun
Varun Gandhi : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయేవారు కాదన్నారు.
అయితే వ్యవసాయ చట్టాల రద్దుతో ఏడాదిగా కొనసాగుతున్న రైతు ఉద్యమం ఆగిపోదని వరుణ్ గాంధీ అన్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై(MSP) చట్టపరమైన హామీ ఇవ్వాలనే రైతుల డిమాండ్ ను కేంద్రం నెరవేర్చాలని పేర్కొంటూ శుక్రవారం మోదీకి లేఖ రాశారు వరుణ్ గాంధీ. ఆందోళన చేపడుతున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం MSPపై చట్టాన్ని చేయాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్ నెరవేరకపోతే.. రైతుల ఆగ్రహం తీవ్రమై మరో రూపంలోకి మారగలదన్నారు. MSP వల్ల రైతులకు ఆర్థికంగా భద్రత కల్పించవచ్చన్నారు.
రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఎంపీ వరుణ్ గాంధీ…ఆందోళనలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన దాదాపు 700 మంది రైతుల కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన తప్పుడు కేసులను కూడా ఉపసంహరించుకోవాలన్నారు.
అలాగే,దేశవ్యాప్తంగా కలకలం రేసిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, దర్యాప్తు పారదర్శకంగా జరిపించాలని కోరారు. లఖింపూర్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా మోదీకి సూచించారు.
ALSO READ Cleanest State : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం,నగరాలు ఇవే..విజయవాడకు అవార్డు