Active Covid Cases In Maharashtra Police Force Almost Triple In Three Weeks
Maharashtra police force : మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే యోచనలో ఉంది. ఇందుకోసం భారీమొత్తంలో పోలీసులను మోహరించింది. 2 లక్షల మంది రాష్ట్ర పోలీసు బలగాలలో యాక్టివ్ కేసుల సంఖ్య గత మూడు వారాలలో దాదాపు మూడు రెట్లు పెరిగింది.
మార్చి మొదటి వారం నుంచి మహారాష్ట్ర అంతటా Covid -19 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల్లో కూడా రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి, మహారాష్ట్రలోని 2 లక్షల బలగాల్లో మొత్తం 36,089 కేసులు, 368 మరణాలు నమోదయ్యాయి.
యాక్టివ్ కేసుల సంఖ్య 2,950కు చేరింది. వీరిలో సిబ్బంది మాత్రమే ఉన్నారు. మూడు వారాల క్రితం.. మార్చి 20న, కరోనా కేసుల సంఖ్య 31,746కు చేరగా.. 346 మరణాలు, యాక్టివ్ కేసుల సంఖ్య 1,046గా ఉంది. ఫిబ్రవరి మధ్య నాటికి మహారాష్ట్ర పోలీసుల్లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి.
మార్చి నాటికి 60శాతం నుంచి 80శాతానికి పెరిగాయి. రోజువారీ ఆధారంగా సగటున 200 కేసుల నుంచి 250 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ఏడు నుంచి 14 రోజులు విధించడంపై తీవ్రంగా చర్చలు జరుపుతోంది.