×
Ad

Sonam Wangchuk: యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు..! డీజీపీ సంచలన వ్యాఖ్యలు..

సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన హింసను వాంగ్ చుక్ ప్రేరేపించారని డీజీపీ జమ్వాల్ ఆరోపించారు.

Sonam Wangchuk: లద్దాఖ్ అల్లర్ల కేసులో యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. లద్దాఖ్ లో హింస చెలరేగడానికి వాంగ్ చుక్ కారణం అని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. వాంగ్ చుక్ ఎన్జీవో లైసెన్స్ ను కూడా రద్దు చేసింది. తాజాగా వాంగ్ చుక్ కి సంబంధించి పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. సోనమ్ వాంగ్ చుక్ కు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (PIO) తో సంబంధాలు ఉన్నట్లు లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ అనుమానం వ్యక్తం చేశారు. మేము కొన్నాళ్ల క్రితం ఓ పాకిస్థాన్ పీఐవోను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. అతడి ద్వారా వాంగ్ చుక్ పాకిస్తాన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. దానికి సంబంధించి రికార్డ్ కూడా తమ దగ్గర ఉందన్నారు. వాంగ్ చుక్ బంగ్లాదేశ్ ను కూడా సందర్శించారని చెప్పారు. వాంగ్ చుక్ కదలికలపై పలు అనుమానాలు ఉన్నాయని డీజీపీ జమ్వాల్ చెప్పారు.

లద్దాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు దిగారు. వాంగ్ చుక్ కు మద్దతుగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు దారితప్పాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన హింసను వాంగ్ చుక్ ప్రేరేపించారని డీజీపీ జమ్వాల్ ఆరోపించారు. నిరసనకారులు హింసకు పాల్పడ్డారని చెప్పారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. ఆ సంఘటనలో నలుగురు మరణించారు, దాదాపు 80 మంది గాయపడ్డారని వెల్లడించారు. రెచ్చగొట్టే ప్రకటనలతో హింసకి, అశాంతికి వాంగ్ చుక్ కారణం అయ్యారని కేంద్ర హోంశాఖ ఆరోపించింది.

రాజ్యాంగ హామీల అమలు, స్వయంప్రతిపత్తి, లద్దాఖ్ కు రాష్ట్ర హోదా, 6 షెడ్యూల్ హోదా డిమాండ్ చేస్తూ వాంగ్ చుక్ సెప్టెంబర్ 10న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

Also Read : పీతల్ గెహ్లోత్.. ఐరాసలో 193 దేశాల సాక్షిగా పాక్ ప్రధానిని చీల్చి చెండాడిన భారత ధీర వనిత..