సీరం సీఈవోకి Y కేటగిరీ భద్రత..హోంశాఖ ఆదేశాలు

Adar Poonawalla కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకి భారీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు దేశవ్యాప్తంగా Y కేటగిరీ భద్రత కల్పిస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశంలో అదర్ పూనావాలా ఎక్కడికి ప్రయాణించినా ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.

కరోనా వ్యాక్సిన్ సరఫరాల విషయంలో వివిధ గ్రూప్ ల నుంచి అదర్ పూనావాలాకి బెదిరింపులు వస్తున్నాయని,కావున సీరం సీఈవోకి భద్రత కల్పించాలని కోరుతూ సీరం ఇనిస్టిట్యూట్ లో గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ డైరక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఏప్రిల్-16న హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం పూనావాలాకి వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు,వ్యాక్సిన్ ధరని తగ్గిస్తున్నట్లు ఇవాళ సీరం సంస్థ ప్రకటించింది. కోవిషీల్డ్ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవడం,వ్యాక్సిన్ ధరను తగ్గించాలని ఇటీవల ప్రధాని మోడీ సీరం,భారత్ బయోటెక్ లని కోరిన నేపథ్యంలో రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ.300కే అందిచనున్నట్లు సీరం సీఈవో బుధవారం ఓ ట్వీట్ లో తెలిపారు. గతంలో ఈ ధర రూ.400 కాగా, వంద రూపాయలు తగ్గిస్తున్నట్టు సీరం వెల్లడించింది. తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీరం సీఈవో తెలిపారు. వ్యాక్సిన్ ధర తగ్గింపుతో రాష్ట్రప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి. దీంతో లెక్కలేనన్ని ప్రాణాలు కాపాడిన వాళ్లవుతాం అని పూనావాలా తన ట్వీట్ లో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు