కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్

  • Publish Date - October 7, 2019 / 07:03 AM IST

గాంధీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ సమావేశాలను విపక్షాలు మూకుమ్మడిగా బహిష్కరించగా.. ప్రియాంక గాంధీ నిర్వహించిన ర్యాలీకి డుమ్మా కొట్టి మరీ ఎమ్మెల్యే అదితి సింగ్‌ అసెంబ్లీకి హాజరయ్యారు.

ఈ క్రమంలో రాయ్‌ బరేలీ రెబల్ ఎమ్మెల్యే ఆదితిసింగ్‌ కు యూపీ కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఆమె బీజేపీ గూటికి చేరుతారనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే కేవలం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకే అసెంబ్లీకి హాజరయ్యానంటూ ఆమె అంతకుముందే వివరణ ఇచ్చుకుంది. 

అదితి సింగ్‌ రాయ్‌బరేలి ఎమ్మెల్యే కాగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాయ్‌బరేలీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉంది. అదితి తండ్రి అఖిలేశ్‌ సింగ్‌ గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. అదితి కూడా ప్రియాంకకు చాలా సన్నిహితురాలు. కానీ, అనూహ్యంగా ఆమె అసెంబ్లీకి వెళ్లి కాంగ్రెస్‌ వర్గాలకు షాకిచ్చారు.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆ లిస్ట్ లో అదితి సింగ్ పేరు కూడా ఉంది.