Aditya-L1: సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు కౌంట్‌డౌన్ షురూ

కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని..

Aditya L1 Mission

Aditya-L1- ISRO: సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు.

ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 23.40 గంటల తర్వాత శనివారం ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు.

కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరులోని యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ (URSC) నుంచి ఉపగ్రహాన్ని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ కు తీసుకొచ్చారు.

సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్పియర్‌ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేయనున్నారు. ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం 6 పేలోడ్లు ఉంటాయి.

ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. లాగ్రేంజియన్‌ పాయింట్‌-1(ఎల్‌-1) భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 109-177 రోజుల పాటు ప్రయాణిస్తుంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో నిర్వహిస్తున్న తొలి ప్రయోగం ఇది.

ISRO Chairman : ఆధిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. సూళ్లూరుపేట‌లోని శ్రీ చెంగాలమ్మ దేవాలయం‌లో ఛైర్మన్ సోమనాథ్ పూజలు