All Pasrty Meeting
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్ లేదా అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరియు అక్కడ చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి సురక్షితంగా తరలించడం వంటి విషయాలను అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని ప్రధాని మోదీ కోరినట్లు సోమవారం విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అయితే విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన ట్వీట్ పై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రతిపక్ష నేతలకు ప్రధాని మోదీయే ఎందుకు అఫ్ఘానిస్తాన్ వివరాలను వెల్లడించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. అఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలపై మోదీకి అవగాహన లేదా అని రాహుల్ ప్రశ్నించారు.
కాగా, తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ చిక్కుకున్న భారతీయులని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు ప్రతి రోజూ కాబూల్ నుంచి రెండు విమానాలను నడుపుతున్నారు. అఫ్ఘన్‌లో ఉన్న హిందువులు, సిక్కులతో పాటు స్థానికులకు కూడా సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్రమంలోనే నాటో, అమెరికా విమానాల్లో అప్ఘాన్ నుంచి కతార్‌కు చేరిన భారతీయులను సోమవారం స్వదేశానికి తీసుకొచ్చింది. దోహా విమానాశ్రయం నుంచి 4 విమానాల్లో మొత్తం 146 మందిని భారత్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కాబుల్ నుంచి తరలించిన వారిలో దోహా నుంచి తీసుకొచ్చిన రెండో బ్యాచ్‌గా చెప్పారు. ఇక, ఆదివారం తొలి బ్యాచ్‌లో మూడు విమానాల ద్వారా మొత్తం 392 మందిని భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. అందులో ఇద్దరు అప్ఘాన్ ఎంపీలు కూడా ఉన్నారు.