లాక్ డౌన్ లో మెరిసింది : అన్‌లాక్ తరువాత మళ్లీ మసకబారుతున్న తాజ్‌మహల్ అందాలు

  • Publish Date - October 16, 2020 / 01:13 PM IST

Tajmahal : తాజ్‌మహల్. కళ్లు తిప్పుకోనివ్వని అందం. ప్రేమకు చిహ్నం. ఆగ్రాలో తాజ్ అందాల్ని ఒక్కసారైనా చూడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ శ్వేత అందం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైంది.



ఇంత ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ అందాలు కాలుష్యంతో మసకబారుతున్నాయి. తాజ్ ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. కానీ ఎంత వరకూ జరుగుతోంది అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది.


కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ ముందు వరకు పర్యాటకులతో కిక్కిరిసిన తాజ్‌మహల్ సందర్శకులు లేకి బోసిపోయింది. మరోవైపు..అదే లాక్‌డౌన్ కారణంగా రవాణా నిలిచిపోయి..ఫ్యాక్టరీలు..కర్మాగారాలు.. మూతపడడంతో కాలుష్యం గణనీయంగా తగ్గింది.



దీంతో తాజ్‌మహల్ పూర్వపు శోభను సంతరించుకుని శ్వేతవర్ణంతో మెరిసిపోయింది. తన అందాలను తిరిగి ఇనుమడించుకుంది. కానీ అన్ లాక్ తరువాత మళ్లీ తాజ్ అందాలు మసకబారిపోతున్నాయి.


దేశంలో అన్‌లాక్ మొదలైన తర్వాత మళ్లీ రవాణా మొదలైంది. ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి. నిర్మాణ రంగం కూడా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే జూలు విదించి ఊపదుకుంటోంది. దీంతో మళ్లీ తాజ్ కు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. మళ్లీ కాలుష్యపు ముప్పు ముంచుకొచ్చింది. ఈ సుందర కట్టడం సమీపంలోనే పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో తాజ్‌మహల్‌పై ధూళి మేఘాలు అలముకుంటున్నాయి. తాజ్ చుట్టూ ప్రమాదకర వాయువులు పేరుకుపోతూన్నాయి. దీంతో తాజ్‌మహల్ అందం మళ్లీ మసక బారుతోంది.


ఆగ్రాలో ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. నిర్మాణాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో..మరోసారి ఆగ్రా నివాసులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజలు అధికారులకు విన్నవించుకుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది. గాలిలో పెరుగుతున్న దుమ్ము, ధూళి తాజ్‌మహల్‌ను దెబ్బతీస్తోందని, ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.