Ahmedabad Plane Crash: భర్త కోసం ఆమె తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండాలని ప్లాన్ చేసుకుంది. పిల్లలు, భర్తతో కలిసి లండన్ బయలుదేరింది. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాలని ఆ జంట ఎన్నో కలలు కంది. కానీ, ఆమె ఒకటి తలస్తే విధి మరోలా తలచింది. విమాన ప్రమాదం ఆ కుటుంబం ఆశలను చిదిమేసింది. ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వారిలో భార్య, భర్త, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
లండన్ లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన రాజస్తాన్ బన్స్వారాకు చెందిన మొత్తం కుటుంబం విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాద మృతుల్లో రాజస్తాన్ కు చెందిన వారు 10 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
ప్రతీక్ జోషి గత ఆరు సంవత్సరాలుగా లండన్‌లో ఉంటున్నారు. ఆయన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. భార్య, పిల్లలు రాజస్తాన్ లోనే ఉంటున్నారు. తన భార్య, ముగ్గురు పిల్లలకు లండన్ లో మంచి భవిష్యత్తు నిర్మించాలని అతడు కలలు కన్నాడు. ఎంతో కష్టపడి పని చేశాడు. చివరికి అతడు అనుకున్నది నెరవేరే సమయం వచ్చింది. కుటుంబంతో కలిసి లండన్ వెళ్లి స్థిరపడేందుకు రెడీ అయ్యాడు. కానీ విధి మరోలా తలచింది. అతడి కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో మృత్యువాత పడింది.
ప్రతీక్ భార్య కోమి వ్యాస్ ఒక డాక్టర్. రాజస్తాన్ బన్స్ వారాలో ఆమె ఉంటుంది. ఇన్నాళ్లూ భర్తకు దూరంగా ఇక్కడే ఉంది. భర్త లండన్ లో స్థిరపడ్డాక తాను కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంది. సరిగ్గా ఆ సమయం రానే వచ్చింది. అందరం కలిసి లండన్ కి వెళ్దామని భర్త చెప్పడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. భర్తతో కలిసి లండన్ వెళ్లి అక్కడే స్థిరపడేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె రెండు రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇక హ్యాపీగా తన భర్త, పిల్లలతో కలిసి లండన్ లో నివాసం ఉండొచ్చని ఎన్నో కలలు కంది. కానీ ఊహించని రీతిలో విమాన ప్రమాదంలో అంతా చనిపోయారు. వీరి జంటకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు ఐదు సంవత్సరాల కవల కుమార్తెలు ఉన్నారు.
ప్రతీక్, కోమి వ్యాస్ ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వారు. పిల్లల పట్ల అంకితభావం కలిగిన వారు. అలాంటి జంట ఇక లేదనే వార్తను బన్స్వారా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి స్నేహితులు, బంధువులు, మాజీ సహోద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.