AIIMS-Delhi : ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై “కోవాగ్జిన్” ట్రయిల్స్ ప్రారంభం

ఢిల్లీ ఎయిమ్స్‌లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

AIIMS-Delhi ఢిల్లీ ఎయిమ్స్‌లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై “కొవాగ్జిన్” వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షల కోసం చిన్నారులకు స్క్రీనింగ్‌ చేస్తున్నారు. 525 మంది వాలంటీర్లపై ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండగా.. స్క్రీనింగ్‌ నివేదిక వచ్చాక వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. 0-28 రోజుల వ్యవధిలో వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వనున్నారు. ఇక,గతవారమే పాట్నా ఎయిమ్స్ లో చిన్నారులపై కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలైన విషయం తెలిసిందే.

కాగా,త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. మూడో దశలో మహమ్మారి ప్రభావం ఎక్కువగా చిన్నారులపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 18 ఏళ్ల పిల్లలపై కోవాగ్జిన్ రెండు, మూడు దశల ప్రయోగ పరీక్షలకు.. ఔషధ నియంత్రణ సంస్థ(DCGI) గతనెలో అనుమతించిన విషయం తెలిసిందే.

మరోవైపు, అహ్మదాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే “జైడస్ క్యాడిలా” టీకా జైకొవ్-డీ క్లినికల్ ట్రయల్స్ 12-18 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై నిర్వహించే యోచనలో ఉన్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. రాబోయే రెండు వారాల్లో ఈ టీకా అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెడుతుందని శుక్రవారం ఆయన చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు