Aiims Director Lists Out Two Main Causes Of Rapid Covid 19 Spread In India
Randeep Guleria దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.34 లక్షలు దాటడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలను ఎయిమ్స్ ఢిల్లీ డైరక్టర్ రణదీప్ గులేరియా ప్రస్తావించారు.
కోవిడ్ వ్యాప్తికి కారణాన్ని “మల్టీఫ్యాక్టోరియల్” గా ఎయిమ్స్ చీఫ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరిలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం నిలిపివేశారని ఇదే సమయంలో వైరస్ పరివర్తనం చెందింది మరియు అది మరింత వేగంగా వ్యాపించిందని గులేరియా తెలిపారు.
దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని వీటిని కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిత పద్ధతిలో చేపట్టాలని అన్నారు. జీవితాలు కూడా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలని అన్నారు. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొందని చెప్పారు. మనం తక్షణమే కేసుల సంఖ్యను కట్టడి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆస్పత్రుల్లో పడకలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. మరోవైపు ఏ వ్యాక్సిన్ కూడా వైరస్ నుంచి వంద శాతం రక్షణ ఇవ్వదని, అయితే వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలు పెరిగి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు.