All eyes on Gyanvapi Masjid case as Varanasi court set to deliver order today
Gyanvapi Masjid Case: వివాదాల్లో మునిగి తేలుతోన్న జ్ఞాన్వాపి మసీదు కేసుపై వారణాసి కోర్టు ఈరోజు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ మసీదులో హిందువులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఒక హిందూ విశ్వాసి వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన కోర్టు.. తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. మసీదులో పూజలకు అనుమతి ఇవ్వడానికి సంబంధించి కొనసాగుతున్న విచారణ సమ్మతమేనా, ఇందుకు న్యాయపరమైన కారణాలు ఏమున్నాయనే విషయమై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తారని అంటున్నారు.
ఈ విషయమై ఆగస్టు 24న ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారనే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని మసీదు కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. అంతే కాకుండా ఈ విషయమై ఎలాంటి వాదనలు వినాలన్నా వక్ఫ్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందని, దానికి మాత్రమే ఆ హక్కును కల్పించాలని అఫిడవిట్లో పేర్కొన్నారు.
జ్ఞాన్వాపి మసీదులో శివలింగం ఉందని, ఆ శివలింగానికి పూజలు చేయడానికి అనుమతి కల్పించాలంటూ హిందూ విశ్వాసులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ఈ అంశం దుమారం లేపింది. హిందూ-ముస్లిం వాదప్రతివాదనల నడుమ మసీదుపై సర్వే చేపట్టడానికి కోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం వారణాసి కోర్టు తీర్పు వెలువరించనుంది.