Sravanthi Palvai : ప్రచారం చేయండి ప్లీజ్.. కోమటిరెడ్డిని కలిసిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. మునుగోడులో తన విజయానికి మద్దుతుగా ప్రచారానికి రావాలని కోరారు.

Sravanthi Palvai : ప్రచారం చేయండి ప్లీజ్.. కోమటిరెడ్డిని కలిసిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

Sravanthi Palvai : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. మునుగోడులో తన విజయానికి మద్దుతుగా ప్రచారానికి రావాలని కోరారు. తాను ప్రచారానికి వస్తానని పాల్వాయి స్రవంతికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. మునుగోడు ప్రచార బాధ్యతలను అప్పగించిన నేతల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో కోమటిరెడ్డిని కలిశారు స్రవంతి.

కోమటిరెడ్డితో పాటు మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి ఇతర సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది ఏఐసీసీ. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఇటీవలే ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అభ్యర్థి ఖరారు కావడంతో ప్రచారంపై ఫోకస్ పెంచింది హస్తం పార్టీ.

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ సీరియస్ గా వర్క్ చేస్తోంది. అన్ని పార్టీలకన్నా హస్తం పార్టీ అన్నింట్లో ముందు ఉంటోంది. మిగతా పార్టీలకన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఓ అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ ప్రచారం విషయంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మండలాల వారిగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యంగా స్పీడ్ పెంచింది హస్తం పార్టీ.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకి ఉపఎన్నిక జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ.. మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాగా, మునుగోడుపై కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్‌ఎస్, బీజేపీల కంటే ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక అనేక కారణాలున్నాయనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌ టికెట్‌ ఆశించినప్పటికీ స్రవంతిని ఖరారు చేయడం ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేసిందని అంటున్నారు.

మునుగోడు సిట్టింగ్‌ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహాన్ని మార్చింది. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్‌ మొదట్లోనే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ టీఆర్‌ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేచి చూద్దామనే ధోరణిని ప్రదర్శించింది.

నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇలాంటి సంకేతాలనే ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు బరిలో ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చే వ్యూహంతోనే అనూహ్యంగా అభ్యర్థి పేరు వెల్లడించిందని అంటున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వస్తుందనే వార్తలు వస్తున్నాయి.