ఏర్పాట్లు పూర్తి : రేపే మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల ఫలితాలు

హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్‌నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఫలితం కూడా గురువారమే వెల్లడి కానుంది. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చివరగా జరగనుంది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు సోమవారం(అక్టోబర్-21,2019)ఎన్నికలు జరిగాయి. 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా అదే రోజున ఉప ఎన్నిక జరిగిన విసయం తెలిసిందే. హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీలో మరోసారి బీజేపీనే పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అసలు ఫలితం రేపు వెలువడనుంది.

హర్యానాలో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ గెలిస్తే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతాడని,హర్యానాలో బీజేపీ గెలిస్తే మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి సీఎంగా కొనసాగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.