దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనాతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఢిల్లీలో నిబంధనలకు విరుద్దంగా జిమ్ తెరిచారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు జిమ్ లో వ్యాయామం చేస్తున్న 11మందిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. జిమ్ ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
సినిమా హాళ్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ కు నో పర్మిషన్:
అన్ లాక్ 2.0లో భాగంగా పలు పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ ను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ఉపయోగపడే జిమ్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. జిమ్ సెంటర్ లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి వాటికి పర్మిషన్ నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో జిమ్ లు తెరవొద్దని ఆదేశించారు. అలాగే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, విద్యా సంస్థలు, మెట్రో రైళ్లకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు.
నిబంధనలకు విరుద్దంగా జిమ్ తెరిచి కసరత్తులు:
కాగా, ఢిల్లీలోని శివపురి ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్ తెరిచారు. కొందరు వ్యక్తులు వచ్చి వ్యాయామం చేస్తున్నారు. జిమ్ షెట్టర్ కొంత భాగమే తెరిచారు. కొన్ని రోజులుగా ఇదంతా సీక్రెట్ గా నడుస్తోంది. ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. జిమ్ పై దాడి చేశారు. ముఖానికి మాస్క్‌లు లేకుండా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ఓనర్ ని కూడా అరెస్ట్ చేశారు. వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 188(ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం) కింద ఆషి ఫిట్ నెస్ జిమ్ సెంటర్ ఓనర్ రహీష్ పై పోలీసులు కేసు పెట్టారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న వారంతా స్థానికంగా నివాసం ఉంటున్నవారే. మాస్కులు లేకుండానే వారంతా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. కరోనా నిబంధనలు బ్రేక్ చేసినందుకు పోలీసులు వారికి జరిమానా విధించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బతికుంటే చాలు:
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిఘా పెంచాలని, ఆకస్మిక తనిఖీలు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో గేమ్స్ ఆడటం కరెక్ట్ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో బతికుంటే చాలు, జిమ్ లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. జిమ్ నిర్వాహాకుడిపై, జిమ్ కి వెళ్లిన వారిపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఇలాంటి పనులు అవసరమా? అని సీరియస్ అయ్యారు. మీరు రిస్క్ లో పడటమే కాకుండా మీ కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారిని కూడా రిస్క్ లో పడేసినట్టు అవుతుందన్నారు.