అన్నదమ్ముల కుమ్ములాటలతో ఆర్జేడీ రెండుగా చీలిపోయింది.లోక్ సభ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదాలు నెలకొనడం…పార్టీ మెంటార్ పదవికి లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ రాజీనామా చేయడం…”లాలూ-రబ్రీ మోర్చా పేరుతో సొంత పార్టీ పెట్టి ఆర్జేడీపైనే విమర్శలు చేస్తూ బీహార్ రాజకీయాలను మరింత వేడెక్కించారు తేజ్ ప్రతాప్.
ఈ సమయంలోనే ఆర్జేడీ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు.తన అసిస్టెంట్ శ్రీజన్ స్వరాజ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఆర్జేడీ విద్యార్థి విభాగం నేతనని చెప్పాడని,తేజ్ ప్రతాప్ ను,నిన్ను చంపేస్తామంటూ ఫోన్ లో శ్రీజన్ ను ఆ వ్యక్తి బెదిరించాడని తేజ్ ప్రతాప్ తెలిపారు.ఈ విషయమై తేజ్ ప్రతాప్ పోలీసులకు ఓ లెటర్ రాశారు. తమ భద్రతకు సంబంధించి ఇది చాలా సున్నితమైన అంశమని, శ్రీజన్ ఈ కాల్ రికార్డ్ చేశాడని పోలీసులకు తేజ్ ప్రతాప్ ఆ లేఖలో తెలిపారు. వెంటనే ఎప్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.