మానవ హక్కులపై మాట్లాడినందుకు వేధిస్తున్నారు..సీబీఐ దాడులపై ఆమ్నెస్టీ

మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఐఐపీఎల్‌), ఇండియన్స్‌ ఫర్‌ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌ (ఐఏఐటీ), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (ఏఐఐఎఫ్‌టీ), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఆసియా ఫౌండేషన్‌ (ఏఐఎస్‌ఏఎఫ్‌) సంస్థలపై కేసు నమోదైంది. ఎలాంటి రిజిస్ట్రేషన్‌, అనుమతి లేకుండానే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ నుంచి ఏఐఐపీఎల్‌, ఇతర ట్రస్టులు విదేశీ విరాళాలను స్వీకరించాయని వాటిపై అభియోగం నమోదైందని అధికారులు తెలిపారు. 

సీబీఐ సోదాలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా స్పందించింది. ఏడాది కాలంగా తమపై వేధింపులు సాగుతున్నాయని ఆరోపించింది. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా నిలబడినందుకు, మాట్లాడినందుకు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. భారత, అంతర్జాతీయ చట్టాలకు లోబడి తాము పని చేస్తున్నట్లు చెప్పింది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.