Anand Mahindra: అగ్నివీరులకు ఉద్యోగమిస్తా.. ఆనంద్ మహింద్రా బంపర్ ఆఫర్..

అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అర్హులైన అగ్నివీరులను తాము నియమించుకుంటామని ఆయన తెలిపారు.

Anand Mahindra: నాలుగేళ్ల పాటు సాయుధ దళాల రెగ్యులర్ కేడర్ లో పనిచేయడానికి యువతకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. జూన్ 14న పథకం అమలుకు శ్రీకారం చుట్టగా.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. బీహార్, హర్యానా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలు రైళ్లకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలోనే ఈ స్కీమ్‌కు సంబంధించి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 24న ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది.

అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అగ్నివీరులను తాము నియమించుకుంటామని ఆయన తెలిపారు. ‘అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి.. మహీంద్రా గ్రూప్ అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకుంటుంది’ అంటూ ఆనంద్ మహింద్రా ట్వీటర్ ద్వారా తెలిపారు. కాగా అగ్నిపథ్ స్కీమ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు. కార్పొరేట్ రంగంలో అగ్నివీరుల ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాయకత్వం, శారీరక శిక్షణతో, అగ్నివీర్ కార్యకలాపాల నుంచి పరిపాలన వ్యవహారాల వరకు పూర్తిస్థాయిలో సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించగలుగుతారని అన్నారు.

ఇదిలాఉంటే అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు పనిచేసిన తరువాత యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముద్ర లోన్, స్టాండ్ ఆఫ్ ఇండియా వంటి పథకాలు అగ్నివీర్లకు సహాయపడతాయని కేంద్ర పేర్కొంది. నాలుగేళ్ల కాలంలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో పాటు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యకు అప్పు కూడా పొందవచ్చునని కేంద్రం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు