బాల్ పై ఉమ్మి వేయవద్దు..ICC నిబంధనలివే

  • Publish Date - June 10, 2020 / 01:41 AM IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కొన్ని తాత్కాలిక నిబంధనలు ప్రకటించింది. కొత్తగా ఐదు నిబంధనలను అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కమిటీ ఆమోదించింది. బాల్‌ను స్వింగ్‌కు అనుకూలంగా మార్చేందుకు, బాల్‌ షైనింగ్‌ కోసం ఆటగాళ్లు కొన్ని టెక్నిక్స్‌ వాడుతుంటారు. బాల్‌పై ఉమ్మివేసి రుద్దడం ద్వారా బంతి స్వింగ్‌ అవడంతోపాటు మెరుస్తుంది.

ఇందు కోసం ఫీల్డింగ్‌ చేసే ఆటగాళ్లు తరుచూ బాల్‌పై ఉమ్మేసి రుద్దుతూ ఉంటారు. అయితే తాజాగా ఐసీసీ బాల్‌పై ఉమ్మిని వాడడాన్ని నిషేధించింది. తుప్పర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున బంతిపై ఉమ్మిని రద్దు చేసింది. ఒకవేళ ఆటగాడు బాల్‌కు లాలాజలం రుద్దుతే అంపైర్లు కొంత వెసులుబాటు కల్పిస్తారు. మరోసారి కూడా అదే విధంగా చేస్తే  హెచ్చరిస్తారు. రెండు హెచ్చరికల తర్వాత దాన్ని పునరావృతం చేస్తే మాత్రం జరిమానా విధిస్తారు. 5 రన్స్‌ను జరిమానాగా విధించి, వాటిని ప్రత్యర్థి జట్టు స్కోరుకు జమ చేస్తారు.

ప్రకటించిన జట్టులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే ఆ ఆటగాడికి బదులు మరో ఆటగాడిని తీసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. బౌలర్‌కు బౌలర్‌, బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్స్‌మెన్‌ను మ్యాచ్‌ రిఫరీ అనుమతి మేరకు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చు. అయితే ఇది కేవలం టెస్ట్‌ మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుందని ఐసీసీ వెల్లడించింది. టీ20, వన్డేల్లో ఈ సబ్‌స్టిట్యూట్‌ ఆప్షన్‌ వర్తించదు.

కరోనా కారణంగా అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. మ్యాచ్‌లు జరగకపోవడంతో క్రికెట్‌ బోర్డులకు ఆదాయం లేకుండా పోయింది. దీంతో క్రికెట్‌ బోర్డులకు ఆదాయం వచ్చేలా ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌ క్రికెట్‌లో ఆటగాళ్ల జెర్సీలపై మరో లోగోకు అనుమతి ఇచ్చింది. 32 అంగుళాలకు మించకుండా లోగో ఉండేలా ఐసీసీ అనుమతించింది.

ఇప్పటి వరకు వన్డే, టీ20లలోనే అనుమతించిన లోగోలు ఇకపై టెస్ట్‌ మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై కనిపించనున్నాయి.  కరోనా మహమ్మారి బారిన పడకుండా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐసీసీ తీసుకున్న ఈ కొత్త నిబంధనలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Read: ఇండియాలోనూ వర్ణ వివక్ష ఉంది.. చదువే అది మార్చాలి: ఇర్ఫాన్