ఇంటి అద్దె కట్టలేదని చావబాదిన పోలీస్, మనస్తాపంతో ఆత్మహత్య

  • Publish Date - August 4, 2020 / 10:14 AM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసు చావబాదాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు అవమాన భారంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాసన్. వినయాగపురంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా క్రాంటాక్ట్ పద్ధతిలో పెయింటర్‌గా పని చేస్తాడు.

4 నెలలుగా ఇంటి అద్దె కట్టడం లేదు:
కాగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా అతని ఉపాధి దెబ్బతింది. జాబ్ పోయింది. ఇల్లు గడవటం కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో 4 నెలలుగా అతడు ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాడు. కాగా, ఆ ఇంటి ఓనర్ రాజేంద్రన్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. శ్రీనివాసన్ ఇంటి అద్దె కట్టడం లేదని ఇంటి యజమాని రాజేంద్రన్ పుజల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ బెన్సమ్, పెయింటర్ శ్రీనివాసన్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. అతడిని చావబాదాడు. రెంట్ ఎందుకు కట్టలేదని తీవ్రంగా కొట్టాడు.

ఇంట్లోకి చొరబడి పెయింటర్ పై ఎస్ఐ దాడి:
ఎస్ఐ తన ఇంట్లోకి చొరబడి కొట్టడంతో శ్రీనివాసన్ మనస్తాపం చెందాడు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన శ్రీనివాసన్ శనివారం(ఆగస్టు 1,2020) ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, 80శాతం కాలిన గాయాలతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసన్ ఆదివారం కన్నుమూశాడు.

అవమానభారంతో పెయింటర్ ఆత్మహత్య:
దీనిపై శ్రీనివాసన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడి మృతికి ఎస్ఐ బెన్సమ్ కారణం అని ఆరోపించాడు. ఆసుపత్రిలో బెడ్ మీద కొనఊపిరితో ఉన్న శ్రీనివాసన్, స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇంటి యజమాని రాజేంద్రన్ తన పలుకుబడితో ఎస్ఐ బెన్సమ్ ని తీసుకొచ్చాడని, ఎస్ఐ తన ఇంటికి వచ్చి రెంట్ కట్టాలని తనను బెదిరించాడని, ఆ తర్వాత తీవ్రంగా కొట్టాడని శ్రీనివాసన్ స్టేట్ మెంట్ లో తెలిపాడు. ఇది దుమారం రేపడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్ఐ బెన్సమ్ ని సస్పెండ్ చేశారు.

అపలు పోలీసులు కొట్టలేదు:
కాగా, ఎస్ఐ బెన్సమ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టేశాడు. తనను సస్పెండ్ చేయడానికి మరో కారణం ఉందన్నారు. ”ఇంటి యజమాని రాజేంద్రన్ విజ్ఞప్తి మేరకు మా పోలీసు టీమ్ శ్రీనివాసన్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో శ్రీనివాసన్ తాగి ఉన్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ కు రావాలని మా పోలీసులు చెప్పారు. వాళ్లసలు శ్రీనివాసన్ ని కొట్టలేదు. సరైన ప్రొసిజర్ ఫాలో అవకుండా సివిల్ వివాదంలో తలదూర్చిన కారణంగానే శ్రీనివాసన్ ను సస్పెండ్ చేశాము అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మహిళలో వాట్సాప్ వీడియో కాల్ లో ప్యాంటు విప్పేసిన ఎస్ఐ:
ఎస్ఐ బెన్సమ్ ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్నారు. గతంలోనూ పలుమార్లు సస్పెండ్ అయ్యాడు. ఓ మహిళను వేధించిన కేసులో అతడు సస్పెండ్ అయ్యాడు. మహిళతో వాట్సాప్ వీడియో కాల్ లో ఎస్ఐ బెన్సమ్ తన ప్యాంటు విప్పేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్ఐ పై కేసు నమోదైంది.