పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించినందుకు ఈకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలో నిరసన ప్రదర్శనలను అనుమతించబోమని నగర పోలీసు కమీషనర్ ఏకే విశ్వనాధ్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహిస్తే డ్రోన్ కెమెరా ద్వారా రికార్డు చేయమని కోర్టు ఆదేశించటంతో సోమవారం జరిగిన డీఎంకే ర్యాలీని పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరణ జరిపారు. ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు జరిగితే అందుకు జరిగిన నష్టానికి వారిని బాధ్యులను చేయవచ్చని కోర్టు సూచించింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలో మాజీ ఆర్ధికమంత్రి పి చిదంబరంతో సహా పలువురు విపక్ష పార్టీల నేతలు ఈ ర్యాలీలో పాల్గోన్నారు.
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, డీఎండీకేలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ర్యాలీకి హాజరయ్యారు. వీరిలో సీనియర్ నేతలు దయానిధి మారన్, కె.కనిమొళి, వైకో, ఉదయనిధి స్టాలిన్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడులోని సేలం, కృష్ణగిరి నగరాల్లోనూ మంగళవారం కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఐఐటీ మద్రాసులో పిజిక్స్ చదువుతున్న జర్మన్ కు చెందిన జాకోబ్ లిండెంతల్ గతవారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గోన్నాడు. వీసా నిబంధనలు అతిక్రమించి నిరసన ప్రదర్శనలో పాల్గోన్నందుకు అతడు దేశం విడిచి వెళ్లాల్సివచ్చింది. తమిళనాడు సీఎం పళని స్వామి పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిచ్చారు. డీఎంకే ర్యాలీలో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు సుమారు 5 వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది.