Ap And Telangana Returnees To Undergo Institutional Quarantine In Odisha For 14 Days
Odisha 14-day quarantine mandatory : కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు క్వారంటైన్‌లో ఉండాలని గతంలో పలు రాష్ట్రాలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వారి విషయంలో ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలు, రైళ్లు లేదా ఏ ఇతర మార్గాల ద్వారా తమ రాష్ట్రంలోకి వచ్చే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కచ్చితంగా తమ రాష్ట్రంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
సరిహద్దు జిల్లాలైన గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్ పూర్ జిల్లాల కలెక్టర్లు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.ఒడిశా ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. ఇక భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఒడిశాకు చేరుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఇక కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్లు లేదా 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినవాళ్లకు మాత్రం క్వారంటైన్ గడువును 7 రోజులకు తగ్గించింది.
అయితే కరోనా అత్యవసర విధులు నిర్వహించే వారితో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, ఒడిశా ప్రభుత్వంతో పనుల నిమిత్తం వచ్చేవారికి వీటి నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. అయితే వారంతా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.