టీడీపీనే డేటా దొంగతనం చేసింది : ఢిల్లీ ఈసీకి బీజేపీ కంప్లయింట్

  • Publish Date - March 8, 2019 / 07:02 AM IST

డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు కమలనాథులు.

టీడీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అనుకూలంగా ఉండని వారి ఓట్లను తొలగిస్తూ..దొంగ ఓట్లను చేరిపిస్తోందని వారు ఆరోపణలు గుప్పించారు. డేటా లీక్స్ ద్వారా ఓటర్ల జాబితా నుండి అధికార, ప్రతిపక్షాలు ఓట్లను తొలగిస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, మురళీధర్ రావులతో పాటు పలువురు నేతలున్నారు. 
Also Read : ఎంత శాంతివంతమైన దేశమో : పాక్ పై చైనా ప్రశంసలు

జీవీఎల్ : 
భేటీ అనంతరం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో గెలవడానికి అధికారపక్షం తప్పటడగులు వేస్తోందని, ఎన్నికల ప్రక్రియను ఎలా ఖూనీ చేస్తుందో పూర్తిగా వివరించడం జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అనుకూలంగా ఓటర్లను ఎలా తొలగించింది..బోగస్ ఓట్లను ఎలా చేర్చింది..మాస్టర్ డేటాను ఎలా దొంగిలించింది..రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోని కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారడం..అలాంటి సీనియర్ పోలీసు వ్యక్తులకు ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పవద్దని సీఈసీని కోరినట్లు జీవీఎల్ వెల్లడించారు. 

కన్నా లక్ష్మీనారాయణ : 
ఏ అడ్డదారి అయినా తొక్కినా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ డేటాను సేకరించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డేటాను సేకరించి కొన్ని లక్షల ఓట్లను తొలగించడమే కాకుండా దొంగ ఓట్లను చేరిపించారని తెలిపారు. మొత్తంగా 50 లక్షలకు పైగా ఓట్లను తొలగించి దొంగఓట్లను చేరిపించారని కన్నా ఆరోపించారు. సీఈసీని బీజేపీ నేతలు కలవడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
Also Read : నేడు పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు