భారత్‌లో కరోనా వల్ల మహిళలే ఎక్కువగా చనిపోతున్నారా!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మహిళల కన్నా పురుషులే  ఎక్కువగా చనిపోతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. కరోనావైరస్ తో వృద్ధులకు ఎంత ముప్పు ఉందో.. పురుషులకు కూడా అంతే ముప్పు ఉందని వైరల్ ఇన్‌ఫెక్షన్లలో లింగ బేధాలపై అధ్యయనం చేస్తున్న జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్త సబ్రా క్లీన్ చెప్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 

ఇండియా, అమెరికాలకు చెందిన ఒక పరిశోధకుల బృందం తాజాగా నిర్వహించిన అధ్యయనంలో.. కరోనావైరస్ సోకుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. వారికన్నా మహిళలే చనిపోతున్నారని వెల్లడైంది.ఈ ఏడాది మే 20వ తేదీ వరకూ దేశంలో కరోనా మరణాలు ప్రాతిపదికగా నిర్వహించిన ఈ స్టడీలో క్రోడీకరించిన ప్రాథమిక అంచనాలను బట్టి.. భారతదశంలో కరోనావైరస్ సోకిన పురుషుల్లో 2.9 శాతం మంది చనిపోతుంటే.. ఆ వైరస్ సోకిన మహిళల్లో 3.3 శాతం మంది చనిపోతున్నారు.

ఈ అధ్యయనం నిర్వహించే సమయానికి భారతదేశంలో మొత్తం 1,10,000కు పైగా నిర్ధారిత కేసులు ఉండగా.. 3,433 మంది చనిపోయారు. అప్పటికి మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో 40-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు 3.2 శాతం మంది చనిపోతే.. పురుషులు 2.1 శాతం మంది మరణించారు. అయితే.. 5-19 సంవత్సరాల వయసున్న వారిలో కేవలం బాలికలు, యువతులు మాత్రమే చనిపోయారు.

ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన నిపుణుల్లో ఒకరైన హార్వర్డ్ యూనివర్సిటీలో జనాభా ఆరోగ్యం ప్రొఫెసర్ ఎస్.వి.సుబ్రమణియన్‌.. మోర్టాలిటీ రిస్క్ (మరణ ముప్పు), మోర్టాలిటీ బర్డెన్ (మరణ భారం) అనే రెండు కీలక అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించినట్లు చెప్పారు. నిర్దిష్ట వయసు వారిలో మరణం సంభవించే ముప్పును ‘మోర్టాలిటీ రిస్క్’ అంచనా వేస్తుంది. కరోనావైరస్ సోకినట్లు నిర్ధారించిన మహిళల కేసుల సంఖ్యతో.. మరణాల సంఖ్యను భాగించారు. ఇక మోర్టాలిటీ బర్డెన్ అంచనా కోసం.. మొత్తం కరోనావైరస్ మరాణాల్లో మహిళల శాతం ఎంత ఉందనేది లెక్కించారు.

ఇప్పటివరకూ ఎక్కువగా మొత్తం కరోనావైరస్ మరణాల గణాంకాలను చూసేవారని.. అలా చూసినపుడు మరణాల్లో ఎక్కువ శాతం పురుషులే (భారతదేశంలో 63 శాతం – ప్రపంచ గణాంకాలకు అనుగుణంగానే ఉంది) ఉన్నారని ప్రొఫెసర్ సుబ్రమణియణ్ వివరించారు. మొత్తం మీద.. భారతదేశంలో కరోనావైరస్ సోకిన మహిళలకు.. ఆ వ్యాధిని తట్టుకుని ప్రాణాలతో బయటపడటానికి ఎటువంటి ప్రత్యేక సానుకూలతలూ లేవని మేం నిర్ధారణకు వచ్చాం అని ఆయన తెలిపారు. 

అయితే, ఈ స్టడీలో గుర్తించిన అంశాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో గుర్తించిన పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు హృద్రోగాలు, రక్తపోటు వంటి అంతర్లీన అనారోగ్య పరిస్థితులతో బాధపడటం పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ కునిహిరో మాట్సుషిటా తెలిపారు.  

చాలా దేశాల్లో మహిళల కన్నా పురుషులే అధికంగా ధూమపానం చేస్తారు. అలాగే తరచుగా చేతులు కడుక్కోవటం కూడా మహిళలకన్నా పురుషుల్లో తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. తీవ్ర కోవిడ్-19 ప్రమాదం కూడా పురుషు రోగులకే ఎక్కువగా ఉందని తాను పాలుపంచుకున్న పలు అధ్యయనాల్లో వెల్లడైందని ప్రొఫెసర్ మాట్సుషిటా తెలిపారు.

మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలు బలంగా ఉండటం వల్ల వారు చనిపోయే ముప్పు తక్కువగా ఉందని కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్లు ‘‘వారి శ్వాసనాళాల మీద ప్రయోజనకరమైన ప్రభావం చూపుతాయని.. శ్వాసనాళాల ఇన్‌ఫెక్షన్లపై రోగనిరోధక వ్యవస్థ ఉత్ప్రేరకంతో వీటికి సంబంధం ఉంది. ఈ విధంగా చూసినపుడు.. పురుషుల కన్నా మహిళల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండటం నిజంగా విశిష్టమైన విషయమే అని మాట్సుషిటా పేర్కొన్నారు.

Read: 24 గంటల్లో 55 మంది ‘మహా’పోలీసులకు కరోనా పాజిటివ్