బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
దేవదుర్గ తాలుకాకు చెందిన ఓ 20 ఏళ్ల వ్యక్తి ఫేస్ బుక్ లో వచ్చిన ఓ పోస్టును వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాడు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలున్నాయి. ఇంకేముంది క్షణాల్లో వైరల్ అయ్యింది. దేవదుర్గ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న హిందూవర్గం ఆందోళన చేపట్టింది.
వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇతనికి సెప్టెంబర్ 03వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీసులు వెంటనే రియాక్ట్ కావడం..ఆందోళనకారులను శాంతింప చేయడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
దేవదుర్గలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.