Delhi liquor scam: అందుకే విచారణ జరుపుతున్నారు.. నన్ను 56 ప్రశ్నలు అడిగారు: కేజ్రీవాల్

Delhi liquor scam: లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తనను విచారించిన అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Delhi liquor scam

Delhi liquor scam: ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలని కుట్ర పన్నారని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తనను విచారించిన అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

“కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నన్ను 9.30 గంటల పాటు విచారించింది. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ నేను సమాధానం చెప్పాను. లిక్కర్ స్కాంకు సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది మొత్తం అసత్యం.. చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా నిజాయితీ గల పార్టీ. ఆప్ ను లేకుండా చేయాలని వారు భావిస్తున్నారు. కానీ, దేశ ప్రజలు మా వెంటే ఉన్నారు” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

“ఆప్ ఢిల్లీ, పంజాబ్ లో పాఠశాలలను, ఆసుపత్రులను నిర్మించింది. వారు (బీజేపీ) మాత్రం ఆ పని చేయలేకపోయారు. ఆప్ ను నాశనం చేయాలని భావిస్తున్నారు. నేను సీబీఐకి థ్యాంక్స చెబుతున్నాను. మంచి ఆతిథ్యం ఇచ్చారు. స్నేహపూర్వకంగా, సామరస్యపూర్వకమైన పద్ధతిలో ప్రశ్నలు అడిగారు” అని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన పలువురు మంత్రులు, ఆప్ నేతలను కలిశారు.

ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శి రాజ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అకారణంగా ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని ప్రస్తుత పరిస్థితిపై అసెంబ్లీలో చర్చిస్తారన్నారు.

Delhi liquor scam: 9 గంటల పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ