Assembly Election Results 2022 Election Commission Lifts Ban On Victory Processions
Assembly Election Results 2022 : దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపులో యూపీలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనే కాకుండా బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ కమలనాథులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవ ఊరేగింపులపై విధించిన నిషేధాన్ని భారత ఎన్నికల సంఘం గురువారం (మార్చి 10) ఎత్తివేసినట్టు ప్రకటించింది.
ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ పార్టీలు విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. జనవరి 8న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అప్పుడే కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల సంఘం అనే ఆంక్షలు విధించింది. విజయోత్సవ ఊరేగింపులపై కూడా సీఈసీ నిషేధం విధించింది. రాజకీయ పార్టీలు రాజకీయ ర్యాలీలు, రోడ్‌షోలు వీధుల్లో నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. రోడ్లపై బహిరంగ సమావేశాలకు బదులుగా వర్చువల్ ర్యాలీలు నిర్వహించుకోవాలని సూచించింది.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల సంఘం కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్టు వెల్లడించింది. కమిషన్ మరో సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విపత్తు నిర్వహణ మార్గదర్శకాల ద్వారా విధించిన రాష్ట్ర స్థాయి ఆంక్షలను సడలిస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను అనుమతిస్తున్నట్టు సీఈసీ ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో కొత్తగా 4,184 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా.. జనవరి 8న కరోనా కొత్త కేసులు 141,506 నమోదు అయ్యాయి. కోవిడ్ పరిస్థితి మెరుగుపడటంతో ఎన్నికల సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను క్రమంగా సడలించిందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను సమీక్షించినట్టు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ సమయంతో పాటు ఫలితాల అనంతరం నిర్వహించే విజయోత్సవ ఊరేగింపులకు సంబంధించి మార్గదర్శకాలను సడలించాలని నిర్ణయించినట్టు కమిషన్ తెలిపింది. విజయోత్సవ ఊరేగింపులపై నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ సడలింపు SDMA ప్రస్తుత సూచనలు, సంబంధిత జిల్లా అధికారులు విధించిన నివారణ చర్యలకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఈసీ ఈ ప్రకటన చేసింది. ఐదు రాష్ట్రాలకుగాను నాలుగు రాష్ట్రాల్లోనూ బీజీపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం ట్రెండ్‌ల ప్రకారం పరిశీలిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందంజలో ఉంది.
Read Also : Panchayat Election : యూపీ ఎన్నికలు.. 75 స్థానాల్లో 67 చోట్ల బీజేపీ విజయం