దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. సైబర్‌ టవర్స్‌ కంటే 3 రెట్లు పెద్దది.. ఒకవేళ భూమిని తాకిందనుకో..

ఇటువంటివి ఢీకొంటే అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి. సముద్రంలో పడితే, పెద్దమొత్తంలో వచ్చే ధూళి సూర్యరశ్మిని కొన్ని వారాలపాటు ఆపేస్తుంది.

Asteroid 2025 FA22: భూమిపై ఒక నగరాన్ని నాశనం చేసేంత సామర్థ్యం ఉన్న గ్రహశకలం మరికొన్ని గంటల్లో భూమి మీదుగా 5,20,000 మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. భవిష్యత్తులో ఇది తిరిగి రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ గ్రహశకలానికి 2025 FA22 అనే పేరు పెట్టారు. 5,20,000 మైళ్ల దూరం అంటే భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం కంటే దాదాపు రెట్టింపు. కాబట్టి, ఈ సారి ఆ గ్రహశకలం వల్ల మానవాళికి ముప్పు లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ గ్రహశకలం భూమి మీదుగా వెళ్తుందని శాస్త్రవేత్తలు ఈ ఏడాది మార్చిలోనే గుర్తించారు. ఇది 2089 సెప్టెంబర్ 23న తిరిగి వస్తే భూమిని ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. (Asteroid 2025 FA22)

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఈ గ్రహశకల గమనాన్ని మరింత కచ్చితమైన రీతిలో కొలిచి, 2025 FA22 నుంచి ఎలాంటి ముప్పూలేదని చెప్పింది.

హవాయిలోని పాన్ స్టార్స్ 2 టెలిస్కోప్‌తో మొదటిసారి ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పుడు, దాని పరిమాణం పెద్దదిగా ఉండడంతో భూమికి దగ్గరగా చేరుకోవడం వల్ల అది భూమిని ఢీకొట్టే ముప్పు ఉంటుందని భావించారు. ఈ గ్రహశకలం 427 నుంచి 951 అడుగుల వెడల్పు ఉంది. ఇది హైటెక్‌ సిటీలోని సైబర్ టవర్స్‌ కంటే మూడు రెట్లు పెద్దది.

ప్రస్తుతం దీని గమనం ప్రకారం.. నేడు, 2089లో, 2173లో భూమికి సమీపంగా వస్తుంది. 2173లో భూమి నుంచి 2,00,000 మైళ్ల దూరంలోకి వస్తుందని అంచనా. 2025 FA22 అంత పెద్ద శిల భూమిని ఢీకొంటే, ఒక పెద్ద నగరాన్ని నాశనం చేస్తుంది. ఇది ఒక భారీ బాంబు పేలుడు లాంటిది.

Also Read: తొమ్మిదో తరగతి బాలుడికి బర్త్‌డే బంప్స్ ఇచ్చిన తోటి విద్యార్థులు.. ఆ తర్వాత..

ఇటువంటివి ఢీకొంటే అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి. సముద్రంలో పడితే, పెద్దమొత్తంలో వచ్చే ధూళి సూర్యరశ్మిని కొన్ని వారాలపాటు ఆపేస్తుంది. దీని వల్ల వాతావరణం, పంటలు దెబ్బతింటాయి.

నేడు ఈ గ్రహశకలం నుంచి ముప్పు లేదని ఈఎస్‌ఏ తెలిపినప్పటికీ, భూమికి 5,20,000 మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. దీన్ని భూమికి సమీపంగా వస్తుందన్నట్లుగానే పరిగణిస్తారు.

ఈ దూరం టెలిస్కోపులతో సులభంగా అధ్యయనం చేసేంత దగ్గరగా ఉంటుంది. ఈ గ్రహశకలం అంతరిక్షంలో గంటకు 24,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే అమెరికా మొత్తాన్ని 15 నిమిషాల్లో దాటేసే వేగం దీనికి ఉంది. 2025 FA22ను కంటితో చూడలేం. ఇది చాలా చిన్న వెలుగుతో, చాలా దూరంలో ఉంటుంది.

కానీ కనీసం 8 అంగుళాల లెన్స్ ఉండే బ్యాక్‌యార్డ్‌ టెలిస్కోప్‌తో చూడవచ్చు. నక్షత్రాల మధ్య కదులుతున్న బిందువులా కనిపిస్తుంది. 2025 FA22 క్యాంపెయిన్‌లో భాగంగా, గ్రహశకలం ఎక్కడ ఉందో, ఎలా కదులుతుందో, ఆకాశంలో ఎంతగా ప్రకాశిస్తుందో తెలుసుకుంటున్నారు.