Bihar
Explosion In The Bhagalpur District : బీహార్ లో పేలుడు సంభవించింది. భాగల్పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పది మందికిపైగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఏమి జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీ, డీఐజీలు ఘటనాస్థలికి చేరుకుని పేలుడుకు జరిగిన ఘటనపై ఆరా తీశారు. కుప్పకూలిన భవంతికి సంబంధించిన శిథిలాలను తొలగిస్తున్నారు.
Read More : Chennai : చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ..28 ఏళ్ల ప్రియ రికార్డు
గాయాలపాలైన వారికి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. Kajvalichak ప్రాంతంలో యతీంఖానా సమీపంలో ఓ భవనం ఉంది. మూడంతస్తులు ఈ భవనంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. సమీపంలో ఉన్న నివాసాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది. అందులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. శిథిలాల కింద 10 నుంచి 15 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. యజమాని అక్రమంగా బాణాసంచా యూనిట్ ను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.