లడఖ్ లో హిమపాతం…10మంది గల్లంతు

లడఖ్ లోని ఖర్దుంగ్ లే ప్రాంతంలో  ఆకస్మిక హిమపాతం కారణంగా దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. ఖర్దుంగ్ లే దేశంలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. లేహ్ జిల్లాలో ఉండే ఈ రోడ్డు షయోక్-సుబ్రా లోయలను కలుపుతుంది. 17,500 అడుగుల ఎత్తులో వీరు గల్లంతైనట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకొన్న వెంటనే బాధితులను రక్షించేందుకు  ఆర్మీ, పోలీసు సిబ్బంది జాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. మంచు కింద మూడు వాహనాలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.  ఈరోజ ఉదయం వీరందరూ తమ వాహనాల్లో వెళ్తూ మంచు చరియలను ఢీకొట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. హిమపాతంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) అధికారి తెలిపారు. అయితే బాధితులు సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందా లేక సామాన్య ప్రజలా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అతను తెలిపారు.

కొన్ని రోజులుగా కాశ్మీర్ రాష్ట్రంలో మంచు అధికంగా కురుస్తోంది. గురువారం  కాశ్మీర్లోని 9 జిల్లాల్లో హిమపాత హెచ్చరికలు జారీ అయ్యాయి. హిమపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం శ్రీనగర్ లో అత్యధికంగా 504 మిల్లీమీటర్ల మంచు కురిసింది. ఉత్తర కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో 15.2 మిల్లీ మీటర్ల మంచు కురిసింది. దక్షిణ కాశ్మీర్ లోని ఫహల్గామ్ లో 9.0 మిల్లీ మీటర్ల మంచు కురవగా కుప్వారాలో 16.2 మిల్లీ మీటర్ల మంచు కురిసింది. జనవరి 19-23 మధ్యలో కాశ్మీర్ వ్యాలీలో అధికంగా మంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

 

ట్రెండింగ్ వార్తలు