Roman saini: 21ఏళ్లకే డాక్టర్ .. ఆ తరువాత కలెక్టర్.. ఇప్పుడు వేల కోట్ల సంస్థకు సహ వ్యవస్థాపకుడు..! ఎవరీ రోమన్ సైనీ..? అతని టెన్త్ మార్కులెన్నో తెలుసా?

అన్ అకాడమీ కొద్దికాలంతోనే భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యా సాంకేతిక సంస్థల్లో ఒకటిగా మారింది. ఆ తరువాత మెడికల్, ఇంజనీరింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ వంటి వాటికి కూడా కోచింగ్ అందిస్తూ 26వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.

Roman saini

Roman saini: ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్ అవ్వడం చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కొందరు యువత ఐఏఎస్ అధికారి కావాలని.. మరికొందరు వ్యాపారవేత్తగా మారాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుంటారు. వాళ్లు అనుకున్న లక్ష్యం చేరుకున్న తరువాత వారి వృత్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తారు. కానీ, రాజస్థాన్‌కు చెందిన రోమన్ సైని అలా కాదు. 18ఏళ్లకే డాక్టర్ అయ్యాడు, ఆ తరువాత నాలుగేళ్లకే కలెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు 26వేల కోట్ల వ్యాపారానికి సహ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నాడు. రోమన్ సైనీ వయస్సు ప్రస్తుతం 30ఏళ్లు మాత్రమే. చిన్నవయస్సులోనే గొప్ప ఘనత సాధించిన సైనీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తుంది. దీంతో అసలు రోమన్ సైనీ ఎవరు? ఆయన విజయం రహస్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకొనేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి..

రోమన్ సైనీ రాజస్థాన్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. రోమన్ సైనీ తండ్రి ఇంజనీర్, తల్లి గృహిణి. రోమన్ సోదరుడు అవేష్ సైనీ వైద్యుడు. అతని సోదరి ఆయుషి సైనీ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తుంది. రోమన్ సైనీ చిన్నతనం నుండే చురుగ్గా ఉండేవాడు. దీంతో తన 16ఏళ్ల వయస్సులోనే ఏఐఐఎంఎస్ వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 21 సంవత్సరాల వయస్సులో ఎంబీబీఎస్ డిగ్రీని పొందాడు. ఆ తరువాత ఏఐఐఎంఎస్‌లోనే నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో ఆర్నెళ్లు పనిచేశాడు. ఈ సమయంలో మెడికల్ క్యాంపులకోసం పల్లె ప్రాంతాలకు వెళ్లేవాడు. అక్కడ ప్రజల జీవన విధానంచూసి చలించిపోయాడు. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించాలంటే వైద్య వృత్తిలో ఉంటే సాధ్యం కాదనిభావించి ఐఏఎస్ కావాలని అనుకున్నాడు.

22ఏళ్లకే కలెక్టర్ ..

ఐఏఎస్ కావాలని అనుకున్నదే తడవుగా సన్నద్దం కావడం ప్రారంభించాడు. యూపీఎస్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి 22 ఏళ్లకే కలెక్టర్‌గా మారాడు. 20 నెలలు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే భావనతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొన్నిరోజుల తరువాత తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేశ్ సింగ్ లతో కలిసి ఓ స్టార్టప్‌ను ప్రారంభించాడు. 2015లో బెంగళూరులో ‘అన్ అకాడమీ’ పేరుతో ఈ స్టార్టప్‌ను మొదలు పెట్టారు. ఆన్‌లైన్ ట్యుటోరియల్‌గా అన్ అకాడమీని రూపొందించారు. ఐఏఎస్ కోచింగ్‌కు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా యూపీఎస్ కోచింగ్ మాత్రమే మొదట్లో అన్ అకామీ ద్వారా అందించేవారు.ౌ

18వేల మందికి ఉపాధి.. 

అన్ అకాడమీ కొద్దికాలంతోనే భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యా సాంకేతిక సంస్థల్లో ఒకటిగా మారింది. ఆ తరువాత మెడికల్, ఇంజనీరింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ వంటి వాటికి కూడా కోచింగ్ అందిస్తూ 26వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతులుగా మారారు. ప్రస్తుతం ఈ ఎడ్‌టెక్ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 15వేల కోట్లకు దాటడం విశేషం. దేశవ్యాప్తంగా శాఖలతో 18వేల మంది విద్యావేత్తలకు అన్ అకాడమీ ఉపాధి కల్పిస్తోంది. 2022లో అన్ అకాడమీ సీఈఓగా గౌరవ్ ముంజాల్ రూ. 1.58 కోట్లు, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88లక్షలు అందుకున్నారు.

అయితే, రోమన్ సైనీ తన పదవ తరగతిలో 85.5 శాతం మార్కులు సాధించాడు. ఇంటర్‌లో 91.4శాతం, గ్రాడ్యుయేషన్‌లో 63శాతం మార్కులు సాధించాడు. ఓ ఇంటర్వ్యూలో .. మీరు ఈ ఘనత సాధిచడం అదృష్టమా అని అడిగితే.. రోమన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అదృష్టం కూడా ఓ భాగం. దానిని ఎవరూ కాదనలేరు. కానీ, అదృష్టం మనందరికీ సమాన అవకాశం ఉంటుంది. ఆపైన మనం చేసే కృషి, పట్టుదల అనే అంశాలపై మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు