Ayodhya Temple Donation 15k Cheques Valued At Rs 22 Crore Bounce
Ayodhya temple donation: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. ఆలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
చాలామంది భక్తులు విరాళాలను చెక్‌ల రూపంలో అందజేశారు. వాటిలో దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయినట్టు వెల్లడైంది. వీటి విలువ సుమారు 22 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆడిట్ నివేదికలో తేలింది.
చెక్కులు ఇచ్చిన వారి ఖాతాల్లో తగిన నిల్వలు లేకపోవడంతో పాటు సంతకాలు సరిపోలకపోవడం, ఓవర్ రైటింగ్ వంటి సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు ట్రస్టు అధికారులు.
ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు బ్యాంకులతో కలిసి పని చేస్తున్నామన్నారు. చెక్కులు ఇచ్చిన వ్యక్తులు తమ పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తాయంటున్నారు.
బౌన్స్ అయిన 15 వేల చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచి సేకరించినవే కావడంతో పని సులువుగా పూర్తవుతుందని చెబుతున్నారు. మిగతా 13 వేల చెక్కులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల రూపంలో సేకరించినవి. సమస్య తలెత్తిన చెక్కులను భక్తులకు తిరిగి పంపిస్తున్నారు.
విరాలాలు లేటెస్ట్ చెక్కులు ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 17 వరకు వీహెచ్‌పీ సహా పలు సంస్థలు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించాయి.