భీమ్ ఆర్మీ చీఫ్ కు బెయిల్…ఢిల్లీలో అడుగుపెట్టకూడదని ఆదేశం

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివారం ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ పోలీసుల ఎదుట చంద్రశేఖర్ హజరుకావాలని కోర్టు ఆదేశించింది. 

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తూ గత నెల 20న ఢిల్లీ జామా మసీద్ దగ్గర అనుమతి లేకుండా భీమ్ ఆర్మీ నాటకీయ నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసన ముందు రోజే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ చంద్రశేఖర్ వారి నుంచి తప్పించుకొని సడెన్ గా జామా మసీద్ లోపల నిరసనకారుల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ తర్వాత రోజు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు మరియు అల్లర్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదుచేశారు.

అయితే చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపడంలో విఫలమైన పోలీసులపై మంగళవారం ఢిల్లీ కోర్టు సీరియస్ అయింది. ప్రతి ఒక్కరికి నిరసనలు తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని కోర్టు తెలిపింది. పార్లమెంటులో చెప్పవలసిన విషయాలు చెప్పబడలేదు కాబట్టే ప్రజలు వీధుల్లో ఉన్నారని కోర్టు తెలిపింది. జామా మసీదు పాకిస్తాన్ లో ఉన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని,ఒకవేళ పాకిస్తాన్ లో ఉన్నాకూడా అక్కడికి వెళ్లి నిరసన తెలియజేయవచ్చని జడ్జి అన్నారు. 1947కు ముందు పాక్ భారతదేశంలో అంతర్భాగమని అన్నారు