షిర్డీలో భక్తుల రద్దీ అంతగా కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఉండే షిర్డీలో ప్రస్తుతం ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే..దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. షిర్డీతో పాటు 25 గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. సీఎం ఉద్దవ్ థాక్రే స్పష్టమైన వివరణ ఇస్తేగాని తాము బంద్ విరమించుకుంటామంటున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న బంద్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీళ్లు దొరకక, షెల్టర్ లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే..సాయిబాబా ఆలయ దర్శనాలు మాత్రం కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది.
మరోవైపు షిర్డీలో గ్రామసభ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ర్యాలీలో స్థానికులు, వ్యాపారులు, సాయి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయి నామ స్మరణతో షిర్డీ వీధులు మారుమోగుతున్నాయి. పాథ్రీ సాయిబాబా జన్మస్థలం కాదంటున్నారు సాయి భక్తులు. పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థలంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడం వివాదాస్పదమైంది. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని షిర్డీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read More : కేజ్రీ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు..బాంబు పేల్చిన ఆదర్శ్ శాస్త్రి