పొట్టి దుస్తులు వేసుకుందని ఓ యువతి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ యువతిపై చిందులు తొక్కాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైకి చెందిన 28 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం సాయంత్రం సమయంలో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై షాపింగ్‌కి వెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి బైక్ ఆపి, నీకు ఇంటి దగ్గర బట్టలు లేవా? ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్? అంటూ ఆమెపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇంతలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అతడ్ని అడ్డుకొని, ఎదురుతిరిగాడు. ఏం మాట్లాడుతున్నావ్? అంటూ వీడియో తీయడం ప్రారంభించడంతో సదరు వ్యక్తి తగ్గాడు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించేలా, ఇక్కడి నిబంధనలు పాటించేలా డ్రెస్ వేసుకోవాలంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
ఇంతలో ఆ యువతి కలగజేసుకొని…నా ఇష్టం ఉన్న డ్రెస్‌లు వేసుకుంటా. అడగడానికి నీవెవరు?’ అని ప్రశ్నించింది. భారతీయ మహిళలు ఇలాంటి దుస్తులు ధరించరు అని అతడు అనగా.. ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.