Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏదో తెలుసా?

Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ పాటికే ఊహించి ఉంటారు.

Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ పాటికే ఊహించి ఉంటారు. యస్.. మీరు అనుకున్నట్టుగానే బెంగళూరు మన దేశంలో అత్యంత రద్దీగా నగరం. డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ 2022 సంవత్సరానికి విడుదల చేసిన ట్రాఫిక్ ఇండెక్స్ ఈ విషయాన్ని తాజాగా స్పష్టం చేసింది. సిటీ సెంటర్ కేటగిరీలో బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండవ నగరంగా గుర్తింపు పొందినట్టు వెల్లడైంది. లండన్ మొదటి స్థానంలో నిలిచింది.

29 నిమిషాల్లో 10 కి.మీ.!
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా వాసికెక్కిన బెంగళూరులో ప్రయాణం అంటే చోదకులకు చుక్కలు కనబడతాయి. రోడ్లపై రద్దీ మామూలుగా ఉండదు. 10 కిలోమీటర్ల దూరానికి దాదాపు 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని నివేదిక టామ్‌టామ్ పేర్కొంది. రద్దీ సమయంలో సిటీలో సగటు ప్రయాణ వేగం గంటకు 18కి.మీ.గా నమోదైంది. 2021లో ఇది 14కిలోమీటర్లుగా రికార్డైంది. రద్దీ సమయాల్లో అత్యధిక సమయం ట్రాఫిక్ లోనే గడిచిపోయే నగరాల జాబితాలో బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 129 గంటలు ట్రాఫిక్ లోనే ఖర్చవుతున్నట్టు అంచనా.

అక్టోబర్ 15.. అధ్వాన్నమైన రోజు
రద్దీ విషయంలో 2022లో బెంగళూరుకు అధ్వాన్నమైన రోజుగా అక్టోబర్ 15 నమోదైంది. ఆ రోజు 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 33 నిమిషాల 50 సెకన్లు పట్టింది. మొత్తంగా చూస్తే బెంగళూరు వాసులు 260 గంటలు లేదా 10 రోజులు డ్రైవ్ చేసినట్టు లెక్క. 134 గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు అంచనా.

రెండవ నగరం పుణే..
భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండవ నగరంగా ఉన్న పుణే.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో 6వ స్థానంలో నిలిచింది. పుణేలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 27 నిమిషాల 20 సెకన్లు పట్టింది. 2021తో పోల్చుకుంటే ఇది 1 నిమిషం మరియు 10 సెకన్లు ఎక్కువ. గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ టాప్ 50లో ఢిల్లీ, ముంబై కూడా ఉన్నాయి. ఇక మొదటి స్థానంలో ఉన్న లండన్ లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 36 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతున్నట్టు నివేదిక తెలిపింది.

Also Read: వాషింగ్‌ మెషిన్‌లో పడ్డ బుడ్డోడు.. పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డ ఏడాది పిల్లాడు

డ్రైవింగ్ కు తగ్గని క్రేజ్
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేట్లు, వాతావరణ సమస్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై ట్రాఫిక్ రద్దీ ప్రభావం ఎలా ఉందనే దాని గురించి టామ్‌టామ్ అధ్యయనం చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఖర్చులు పెరుగుతున్నప్పటికీ డ్రైవింగ్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా నగరాల్లో డ్రైవింగ్ ఒక ప్రసిద్ధ రవాణా రూపంగా ఉందని అధ్యయనం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు