Banks: 24, 25 తేదీల్లో బ్యాంకులకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తెలుసుకోండి..

ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, వాయిదా వేసుకోండి. ఎందుకంటే..

Bank

Banks Employees Strike: ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, వాయిదా వేసుకోండి. ఎందుకంటే.. ఆ రెండు రోజులు దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తో జరిపిన చర్చల్లో ఫలితం లేకపోవడంతో ప్రకటించిన విధంగానే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) తెలిపింది.

 

ఐదు రోజుల పనిదినాలు సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో ఏర్పాటైన యూఎఫ్బీయూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతుందని చెప్పారు.

 

పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) జారీ చేసిన ఆదేశాలనూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది తమ ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుందని పేర్కొన్నాయి. డీఎఫ్ఎస్ జారీ చేసిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా గ్రాట్యూటీ చట్ట పరిమితిని రూ.25లక్షలకు పెంచాలని, ఈ పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానం చేయాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

 

యూఎఫ్బీయూలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడెరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫడెరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (ఎన్సీబీఈ), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) సహా తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి.