BCCC: మహిళలు, పిల్లలపై నేరాలను చూపించొద్దు.. టివీ ఛానెళ్లకు బీసీసీసీ ఆదేశాలు

మహిళలు, పిల్లలు మరియు ఎల్‌జీబీటీక్యూ(Lesbian, gay, bisexual, and transgender) కమ్యూనిటీకి సంబంధించిన నేరాలను, వీడియోలను టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడాన్ని బ్రాడ్‌కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలి (BCCC)) నిషేధించింది.

Tv Channels

Gender-based Violence: మహిళలు, పిల్లలు మరియు ఎల్‌జీబీటీక్యూ(Lesbian, gay, bisexual, and transgender) కమ్యూనిటీకి సంబంధించిన నేరాలను, వీడియోలను టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడాన్ని బ్రాడ్‌కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలి(Broadcasting Content Complaints Council (BCCC)) నిషేధించింది. దేశంలోని అన్ని ఛానెల్‌లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుండగా.. ఛానెళ్లకు ఈమేరకు ఆదేశాలు జారీచేసింది బీసీసీసీ.

ఛానెళ్లలో ప్రసారం అయ్యే ఏదైనా కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే బ్రాడ్‌కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలితో పాటు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్), న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) వంటి కొన్ని నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చెయ్యవచ్చు. ఈ సంస్థలు అభ్యంతరకరమైన విషయాలపై చర్యలు తీసుకుంటాయి. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు, 1994లో సవరించగా, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం, 1995లోని నిబంధనల ప్రకారం ప్రజలు టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయబడుతున్న విషయాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఇటీవలికాలంలో నేరాలకు సంబంధించిన విషయాలను టీవీలు ఎక్కువగా ప్రసారం చేస్తుండగా.. మహిళలు, పిల్లలు, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటీకి చెందిన ప్రజలపై నేరాలను చిత్రీకరించడంలో, ప్రసారం చెయ్యడంలో సంయమనం పాటించాలని బీసీసీసీ గురువారం(1 జులై 2021)టీవీ ఛానెళ్లను ఆదేశించింది.

టీవీ ప్రోగ్రామ్‌లలో లింగ ఆధారిత హింసను చిత్రీకరించడానికి ఒక వివరణాత్మక సలహాను జారీ చేసింది. మహిళలు, పిల్లలు మరియు ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై హింసను గురించిన విషయాల్లో స్పష్టమైన అడ్వైజరీని విడుదల చేసింది కౌన్సిల్. అటువంటి దృశ్యాలను స్క్రిప్టింగ్, చిత్రీకరణ మరియు ఎడిటింగ్ చేసేటప్పుడు ఛానెల్స్ వివేకంతో ఆలోచించాలని, జాగ్రత్త వహించాలని పునరుద్ఘాటించింది బీసీసీసీ.