Dangerous Links : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఈ లింక్స్ క్లిక్ చేశారో, మీ డబ్బులు మాయం

మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తారా? అయితే జాగ్రత్త.. ఆ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు...

Dangerours Links

Dangerous Links : ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. అంతా టెక్నాలజీ మీదే డిపెండ్ అయ్యాం. టెక్నాలజీ పుణ్యమా అని అన్ని పనులు నిమిషాల్లో అయిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక పనులు మరింత సులభం అయ్యాయి. టెక్నాలజీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, అదే సమయంలో ఇదే టెక్నాలజీని వాడుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. సైబ‌ర్ క్రిమిన‌ల్స్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ కు పాల్పడుతున్నారు. అమాయకులను ఈజీగా మోసం చేస్తున్నారు.

టెక్నాల‌జీ గురించి ఎక్క‌వుగా అవగాహన లేని స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌ను టార్గెట్ చేసుకొని సైబ‌ర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సైబ‌ర్ నేరాలు బాగా పెరిగాయి. సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ‌ను టార్గెట్ చేశార‌న్న విష‌యాన్ని యూజ‌ర్లు చాలా ఆసల్యంగా తెలుసుకుంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బు వారికి తెలియ‌కుండానే మాయం అవుతున్నాయి.

సైబ‌ర్ నేర‌గాళ్లు ఎక్కువ‌గా ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్ చేసే క‌స్ట‌మ‌ర్ల‌ను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఆయా క‌స్ట‌మ‌ర్ల బ్యాంకు వివ‌రాలు సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు ఎలా తెలుస్తున్నాయి. అసలు డబ్బులు ఎలా మాయం చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే.. ఫేక్ లింక్స్ లేదా ఫ్రాడ్ లింక్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ లింక్స్‌ను పొర‌పాటున క్లిక్ చేశారంటే… ఇక అంతే సంగ‌తులు. అకౌంట్‌లో డ‌బ్బులు క్ష‌ణాల్లో మాయమైపోతాయి.

కేవైసీ అప్ డేట్ పేరుతో ఘరానా మోసం…
ఈ తరహా మోసాలను టెక్నికల్ గా చెప్పాలంటే.. ఫిషింగ్ అటాక్ (Phishing Attack) అంటారు. సంబంధిత బ్యాంకుల నుంచి పంపిస్తున్న‌ట్టుగా మెసేజ్‌ను త‌యారు చేసి.. టార్గెట్ చేసిన యూజ‌ర్ల‌కు పంపిస్తారు. డియ‌ర్ క‌స్ట‌మ‌ర్, మీ అకౌంట్ స‌స్పెండ్ అయింది. వెంట‌నే http://446bdf227fc4.ngrok.io/xxxbank ఈ లింక్ క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోండి.. అనే మెసేజ్‌ను, మెయిల్‌కు కానీ.. వాట్సప్‌లో కానీ.. మెసేజ్‌గా కానీ పంపిస్తుంటారు. అకౌంట్ స‌స్పెండ్ అయింది.. అనే మెసేజ్ చూసి కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు.. నిజ‌మే అనుకొని.. స‌ద‌రు లింక్‌ను క్లిక్ చేస్తారు. దీంతో అది డ‌మ్మీ వెబ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అక్క‌డ బ్యాంకింగ్ వివ‌రాలు, ఇత సెన్సిటివ్ డేటా మొత్తాన్ని సైబ‌ర్ నేర‌గాళ్లు తస్క‌రించి.. అకౌంట్ నుంచి డ‌బ్బును కాజేస్తారు.

అలాంటి మేసేజ్ లతో జాగ్రత్త…
మీ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబ‌ర్‌ను అప్ డేట్ చేసుకోండి. లేక‌పోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. స‌స్పెండ్ అవుతుంది. ఇవాళే చివ‌రి తేదీ.. అని బ్యాంకుల పేర్ల‌తో వ‌చ్చే ఎటువంటి మెసేజ్‌ను కానీ.. మెయిల్‌ను కానీ న‌మ్మ‌కండి. మీకు ఏదైనా డౌట్ వేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి స‌మాచారం తెలుసుకోండి. లేదా బ్యాంక్‌కు ఫోన్ చేసి స‌మాచారం తెలుసుకోండి.. కానీ.. సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో మాత్రం ప‌డ‌కండి అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఫేక్ లింక్స్ ను గుర్తించడం ఎలా?
“http:// 1a4fa3e03758. ngrok [.] io/xxxbank” ఈ టైప్‌లో లింక్స్ ఉంటే అస్స‌లు క్లిక్ చేయ‌కండి. అవి కచ్చితంగా ఫిషింగ్ లింక్సే. రాండ‌మ్ నెంబ‌ర్స్‌తో లింక్ ఉంది అంటే అది కచ్చితంగా ఫేక్ లింకే అని అర్థం చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా ఏ వెబ్‌సైట్‌లో కానీ డ‌బ్బుల‌కు సంబంధించిన ఏ లావాదేవీ చేసినా.. దానికి కచ్చితంగా HTTPS ప్రోటోకాల్ ఉండాలి. అదే సెక్యూర్డ్ ప్రోటోకాల్. అన్ని బ్యాంకులు అదే ప్రోటోకాల్‌ను ఉప‌యోగిస్తాయి. కానీ.. సైబ‌ర్ నేర‌గాళ్లు మాత్రం.. HTTP ప్రోటోకాల్‌ను ఉప‌యోగిస్తారు. లింక్ క్లిక్ చేయ‌గానే.. ప్రోటోకాల్.. హెచ్‌టీటీపీ ఉంటే.. అది కచ్చితంగా ఫేక్ లింక్ అని గ్ర‌హించాలి. ఒక్కోసారి యూఆర్ఎల్ షార్ట్‌న‌ర్ ఉప‌యోగించి కూడా ఫిషింగ్ లింక్స్‌ను పంపుతుంటారు.

ఇక ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పేర్ల‌తో.. బంప‌ర్ ఆఫ‌ర్, రూపాయికే ఫోన్‌.. అంటూ కొన్ని లింక్స్‌ను వాట్స‌ప్‌, టెలిగ్రామ్‌, మెయిల్స్‌, మెసేజ్‌ల ద్వారా షేర్ చేస్తుంటారు. భలే మంచి ఆఫర్ అని కక్కుర్తి పడి ఆయా లింక్స్‌ను క్లిక్ చేశారో ఇక అంతే… మీ ఫోన్‌లో ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం సైబ‌ర్ నేర‌గాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత మీ డిటెయిల్స్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు ఏదైనా చేయొచ్చు. అందుకే.. ఫోన్‌కు ఫార్వార్డ్ చేసే ప్ర‌తి లింక్‌ను క్లిక్ చేస్తూ… వాళ్లు అడిగిన డేటాను ఎంట‌ర్ చేస్తే.. సైబ‌ర్ నేర‌గాళ్ల టార్గెట్ మీరే అవుతారని, ఆ త‌ర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను హ్యాక‌ర్లు ఖాళీ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా యూజర్లు చాలా అలర్ట్ గా ఉండాలని, అనుమానాస్పద లింక్స్ మీద క్లిక్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.