Karthika Masam : శివకేశవులకు ప్రీతికరం….కార్తీక మాసం….ప్రతిరోజు పర్వదినమే!..

కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీపం చీకట్లను దూరం చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. దేవాలయాల్లో ప్రత్యేకంగా దీప స్తంభాలను ఏర్పాటు చేస్తారు.

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. అది శివ‌కేశ‌వుల‌కు అత్యంత ప్రీతిక‌ర‌మైన మాసం. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యా దీపం నమోస్తుతే. మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య మర్నాడు అంటే కార్తీక మాస పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. సూర్యుడు తుల రాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం, అర్చనం, వ్రతం, ఆరాధనం, దీపారాధనం, దానం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయట. రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే ఫుణ్యఫలం లభిస్తుంది. వేకువజామున నక్షత్రాలున్న సమయంలో నదీస్నానం చేయడాన్ని దైవస్నానం అంటారు. దీంతో శారీరక దోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం మంచిది. కార్తీక మాసంలో ముఖ్యమైన వారం సోమవారం. ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరం. ఆ రోజున వేకువజామునే లేచి స్నానాధికాలు ముగించుకుని శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్ర సమయంలో నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. నక్షత్ర దర్శనం తర్వాత శివాలయంలో శివుడిని దర్శించుకోవాలి.

కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను…. శివునికి బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయ‌ని పండితులు చెబుతుంటారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసికోట వద్ద ఉదయం, సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా చేస్తుంటారు. పౌర్ణమి రోజున తులసికోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు.

కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీపం చీకట్లను దూరం చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. దేవాలయాల్లో ప్రత్యేకంగా దీప స్తంభాలను ఏర్పాటు చేస్తారు. నిరంతరంగా దీపాలను వెలిగిస్తారు. కార్తీకంలో ఆకాశదీపాలను నువ్వుల నూనెతో వెలిగించడం తప్పనిసరి. దీనివ‌ల‌న సకల సంపదలు సమకూరుతాయని నమ్ముతారు. దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించి కార్తీక పురాణం లేదా భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామావళి వంటి వాటిని పారాయణం చేయాల‌ని పండితులు చెబుతుంటారు. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో ఆచ‌రింద‌చే నోములకు ఎంతో ప్రాధాన్యత‌ ఉంది. భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలుగా చెప్పవచ్చు. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది ఒక పూట భోజనం చేస్తూ ఏకభుక్తంగా ఉంటారు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారం, పూర్ణిమ తిథినాడు ఉప‌వాసం ఉంటే మంచిదంటారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేయటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు