Hero Electric
Hero Electric: ద్విచక్రవాహనల తయారీ సంస్థల్లో హోండా కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. హీరోహోండా కలిసి ఉన్న సమయంలో ప్రపంచంలోనే అత్యధిక మోటర్ సైకిళ్లను తయారు చేసేవారు. ప్రపంచ మోటర్ సైకిల్స్ మార్కెట్లో వీరి షేర్ 37.1 శాతం ఉండేది. ఇక ఈ రెండు విడిపోయిన తర్వాత ఎవరి మోడల్స్ వారు విడుదల చేసుకుంటున్నారు. ప్రస్తుతం హీరో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. హీరో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి శరవేగంగా సాగుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే హీరో కంపెనీ తమ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పిస్తుంది. కంపెనీలో కనీసం రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి ప్రయోజనాలను కల్పించడానికి ఓ కార్యక్రమం ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమన స్థాయిలో బెనిఫిట్స్ కల్పించనుంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కంపెనీలో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ఉపాధిని కల్పించడం.
ఉద్యోగులకు వాహన రుణాలను అందించడం, అలాగే అదనపు సెలవులు ఇవ్వడం.
దీర్ఘకాలిక గృహ రుణాలను స్థిర వడ్డీకి హీరో కేర్ అందిస్తుంది. ఉద్యోగులకు ప్రసూతి సెలవుల కింద 15 రోజులు సెలవులు ఇవ్వడం, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి 3 నెలల్లో 10 రోజుల వరకు ఇంట్లో నుంచి పనిచేయవచ్చు. 20-25 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు పనితీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు, స్కాలర్ షిప్స్ ఇవ్వనుంది. పరీక్షల సమయంలో వారికి ఫ్లెక్సీబుల్ టైమింగ్స్ కల్పించనుంది.
ఇక ఈ అంశంపై హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. తమ ఉద్యోగులు రెండేళ్లుగా కష్టపెడుతున్నారని.. ఈ రోజు తాము ఈ స్థాయికి చేరుకున్నామంటే ఉద్యోగుల కృషి పట్టుదలే కారణమని.. అన్నారు. తమ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులకు సంస్థ సాయం అందిస్తుందని వివరించారు. రిటైర్ అయిన ఉద్యోగులు మాజీ హీరో క్లబ్ లోచేరి తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది అని అన్నారు. రిటైర్ అయినవారు క్లబ్ లో జాయిన్ అయితే ఐదేళ్ల పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.