మమత సర్కార్ కు కేంద్రం మెమో…బెంగాల్ లోనే అత్యధిక కరోనా మరణాల రేటు

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు విఫలమైనట్టు కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ అజయ్ భల్లా రెండు పేజీల లెటర్ లో తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువగా ఉందని, 13.2 శాతం ఉందన్న విషయం స్పష్టమైందని ఇందులో విమర్శించారు.

పశ్చిమబెంగాల్ లో లాక్ డౌన్ ఉల్లంఘనలు యథేఛ్చగా జరిగాయని, పోలీసుల మీద, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఈ లెటర్ లో ఆరోపించారు. క్వారంటైన్ సౌకర్యాలె కూడా బెంగాల్ లో సరిగ్గా లేవని ఆరోపించారు. కరోనా టెస్ట్ లు తక్కువగా చేస్తున్నారని ఆరోపించారు.

శానిటైజైషన్ లేకుండానే మార్కెట్లలో ఓవర్ క్రౌడ్,మాస్క్ లు లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుగుతుండటం,కంటైన్మెంట్ జోన్లో లాక్ డౌన్ నిబంధనలు అములచేయకపోవడం,ఎటువంటి ఆంక్షలు లేకుండా రిక్షాలను రోడ్లపైకి అనుమతించడం వంటివి జరిగినట్లు తాము గుర్తించినట్లు ఆ లేఖలో భల్లా తెలిపారు. అసలే గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి, దీదీకి మధ్య భేదాభిప్రాయాలు మరింత రేగుతున్న ఈ తరుణంలో ఈ మెమో పట్ల మమత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏప్రిల్ 20 న కోల్‌కతా మరియు జల్పాయ్ గురి జిల్లాలకు పంపిన రెండు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసిటి) సమర్పించిన నివేదికల నేపథ్యంలో భల్లా ఈ లేఖ రాశారు. ఈ బృందాలు బెంగాల్ రాష్ట్రంలోని మొత్తం ఏడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాయని, తమ పరిశీలనలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో 140 మరణాలు, కోలుకున్న 364 మందితో సహా 1,344 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.