లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి కష్టాలు

  • Publish Date - April 11, 2020 / 12:42 PM IST

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే సోషల్ మీడియాలో లాక్ డౌన్ మీద  టిక్ టాక్ వీడియోలు వీర లెవల్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో  భర్తలమీద, భార్యల మీద, పోలీసుల మీద, ఇలా వివిధ రకాల వీడియోలు  చక్కర్లు కొడుతున్నాయి.  

వీటిలో భర్తల చేత పని చేయిస్తున్న భార్యల వీడియోలు  కడుపుబ్బ నవ్విస్తున్నాయి.  ఇంట్లో వంటపని, పాచి పని మొదలు అన్నీ పనులను భర్తలచేత చేయిస్తున్న భార్యల వీడియోలు చూస్తుంటే నిజంగానే మొగుళ్లు ఇవన్నీ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.  

కానీ బెంగుళూరులోని ఒక భర్తకు మాత్రం నిజంగానే కష్టకాలం దాపురించింది. ఎలాగంటారా…… మనోడికి ఇద్దరు  భార్యలు. ఇద్దరినీవేర్వేరు ఇళ్లలో పెట్టివారికి ఇన్నాళ్లు న్యాయం చేశాడు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో ఇల్లు కదిలి బయటకు రాలేని పరిస్ధితి వచ్చేసరికి ఎవరికి న్యాయం చేయాలో అర్ధంకాని పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

బెంగుళూరు లో బట్టల వ్యాపారం చేసే  ఉమేష్ (40)(పేరు మార్చాం) కు ఇద్దరు భార్యలు  ఒకరు సుధ, మరోకరు నిధి. ఉమేష్ కు సుధ తో 10ఏళ్ల క్రితం పెళ్లయ్యింది.  వీరికి ఒక సంతానం. పెళ్లైన కొన్నాళ్లకు  ఉమేష్ కు మరోక మహిళతో వివాహేతర సంబంధం ఉందనే విషయం సుధకు తెలిసింది. ఆమె భర్తను ఆవిషయంపై నిలదీయగా  వివాహేతర సంబంధం కాదని రెండో భార్య అని చెప్పాడు. కోపంతో రగిలిపోయిన సుధ భర్త ఉమేష్  మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషయం రెండు వైపులా పెద్దల దగ్గర పంచాయతీకి వచ్చింది. రాజీకొచ్చిన ఉమేష్ ఇద్దరినీ సమానంగా చూసుకుంటానని…ఇద్దరికీ న్యాయం చేస్తానని..ఒక్కోక్కరి వద్ద వారం రోజులు చొప్పున సమయం కేటాయిస్తానని చెప్పటంతో సుధ కేసు ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి ఉమేష్ ఈ ఒప్పందం ప్రకారం  ఇద్దరికీ సమయం కేటాయిస్తూ హ్యాపీగా కాపురం చేసుకుంటూ  వస్తున్నాడు.

అయితే దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతున్నప్పటి నుంచి ఉమేష్ కు కష్టాలు మొదలయ్యాయి.  మార్చి21న ఉమేష్ షెడ్యూల్ ప్రకారం  నిధి  ఇంటికి వెళ్లాడు.  తర్వాత వారం  లెక్క ప్రకారం మార్చి28 న సుధా ఇంటికి వెళ్ళాలి. కానీ లాక్ డౌన్ అమలవుతున్నందువల్ల సుధ ఇంటికి వెళ్లలేక పోయాడు.

దీంతో తన భర్తను తన వద్దకు తీసుకు రావాలని సుధ పోలీసులను ఆశ్రయించింది.  ఇంట్లో నిత్యావసర వస్తువులు లేవని…. తన భర్తను తన ఇంటికి చేర్చాలని ఆమె  బెంగుళూరులోని మహిళా  పోలీసు హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేసి కోరింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు.