Bengaluru Floods : అప్పుడెప్పుడో ముంబై.. ఆ తర్వాత చెన్నై.. నిన్న హైదరాబాద్, ఇవాళ బెంగళూరు.. వరదలతో వణికిపోతున్న మహానగరాలివి. చెన్నై, ముంబై అంటే సముద్ర తీర ప్రాంతాలు. అందుకే వరదలు ముంచెత్తుతున్నాయి అనుకోవచ్చు. మరి బెంగళూరు, హైదరాబాద్ కి ఎందుకీ పరిస్థితి? మహానగరాలు అని జబ్బలు చరుచుకని మరీ మహా గొప్పగా చెప్పుకుంటున్న నగరాలకు ఈ పరిస్థితి ఎందుకు? మంచి నీళ్లకే కరువు కనిపించే నేలపై ఇంతటి వరద విలయం ఎందుకు? అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? వరదలు మిగిల్చిన ప్రశ్నలేంటి?
ముంబై, చెన్నైకి ఏమాత్రం తీసిపోని జలవిలయాన్ని 2020లో చూసింది హైదరాబాద్. అలాంటి పరిస్థితే ఇప్పుడు బెంగళూరులోనూ కనిపిస్తోంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నానిపోతోంది. ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. రహదారులు నీట మునిగాయి. అపార్ట్ మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
కోట్ల రూపాయలు వెచ్చించి వీవీఐపీలు, పారిశ్రామికవేత్తలు, టాప్ మోస్ట్ కంపెనీల అధిపతులు కొనుగోలు చేసిన విల్లాలు కూడా నీట మునిగాయి. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బైజూ రవీంద్రన్, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి లాంటి బిలియనీర్లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు.
ఈ వరదలతో బెంగళూరులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ట్రాక్టర్లు, జేసీబీల్లో జనాలను తరలిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మహా నగరాలు అని చెప్పుకునే సిటీల్లో బెంగళూరు టాప్ లో ఉంటుంది. భౌగోళికంగా చూసినా ఎత్తైన ప్రాంతంలోనే ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను వరదలు ముంచెత్తడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితికి ప్రకృతి ప్రకోపమే కారణం అంటే అది కరెక్ట్ కాదా? మనిషి చేసిన పాపాలు, మిగిల్చిన లోపాలు వరదలకు కారణం అవుతున్నాయా? ఇప్పటికైనా వరద నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?
బెంగళూరు వదర కళ్ల ముందు పారుతున్న వేళ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న కొత్త చర్చ ఏంటంటే..
1. ముంబై చెన్నై సరే హైదరాబాద్, బెంగళూరుకు ఎందుకీ పరిస్థితి?
2. బెంగళూరు వదరలు మిగిల్చిన ప్రశ్నలేంటి?
3. ఈ స్థాయిలో వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయ్?
4. అసలు లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి?
5. మనిషి మారకపోతే, తనను తాను మార్చుకోకపోతే ప్రమాదం తప్పదా?
ముంబై, చెన్నైలలో లోతట్టు ప్రాంతాలు ఎక్కువ. అందుకే వరదలు ఎక్కువ కనిపిస్తాయి అనుకోవచ్చు. కానీ, హైదరాబాద్, బెంగళూరు పరిస్థితి అది కాదు. అయినా సరే చినుకు పడితే చాలు.. జనం వణుకుతున్న దౌర్భాగ్యం. అవసరం కింద నలిగి మనిషి ఎప్పుడో నాశనం అవుతాడన్నట్లు.. అవసరాల పేరుతో వేస్తున్న అడుగులే ప్రమాదాన్ని ఆహ్వానించేలా చేస్తున్నాయి. అడ్డగోలు ఆక్రమణలు, చెరువుల్లో వెలసిన భవనాలు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు.. అధికారుల కక్కుర్తి, రాజకీయ నాయకుల స్వార్థం, రియల్ ఎస్టేట్ మాఫియా బరితెగింపు, సరిగా లేని డ్రైనేజీ వ్యవస్థ. ఇలా చెప్పుకుంటూ పోతే వరదల పరిస్థితికి వందల కారణాలు కనిపిస్తున్నాయి.
చుక్క నీరు కూడా బయటకు పోయే పరిస్థితులు కనిపించడం లేదు. మొన్న హైదరాబాద్ విషయంలో జరిగిందీ అదే. ఇప్పుడు బెంగళూరు విషయంలో అదే జరిగింది.
ఇది చాలా సీరియస్ ఇష్యూ అని, అర్బన్ ప్లానింగ్ లో పెను సంస్కరణలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఐటీ హబ్ గా మారడంతో గత 20ఏళ్లలో బెంగళూరుకు కోట్ల మంది తరలివచ్చారు. భారీ కట్టడాలు వెలిశాయి. మహా నగరం స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు సిటీని విస్తరించుకుంటూ పోయారు. నగరాన్ని పెద్దది చేద్దాం అనుకున్నారే తప్ప ప్లానింగ్ విషయంలో పట్టించుకున్నట్లు కనిపించలేదు. డ్రైనేజీ వ్యవస్థ చెత్తగా ఉంది. భారీ వరదలను తట్టుకునే శక్తి వాటికి లేదు. ఇరుకు నాలాలు చెత్తా చెదారంతో పేరుకుపోవడం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మురుగు నీటి పారుదల వ్యవస్థ సదుపాయాలు పెరక్కపోవడం సిలికాన్ వ్యాలీని అల్లకల్లోలం చేస్తున్నాయి.
1990లో బెంగళూరులో 226 కిమీ పొడవున్న డ్రైనేజీ 2017 నాటికి 110 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఇది చాలు నాలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. కుండపోతగా వర్షం కురుస్తుంటే బయటకు వెళ్లే దారి లేక కాలనీలకు కాలనీలే చెరువుల్లా మారిపోయాయి. తాజా వరదతో బెంగళూరులోని ఐటీ కంపెనీలన్నీ వణుకుతున్నాయి.
బెంగళూరు అనుభవాల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగళూరు తర్వాత ఐటీలో మేటి హైదరాబాద్ అంటున్నారు. పరిస్థితులను మెరుగుపరుచుకోకపోతే వరదల్లోనూ బెంగళూరు తర్వాత మళ్లీ హైదరాబాద్ మారడం ఖాయం అన్న చర్చ జరగుతోంది. వరద భయం ఏంటో ఆల్రెడీ భాగ్యనగరం చూసింది. అందుకే వర్షం పడినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. బెంగళూరు పరిణామాలు చూసి తెలంగాణ సర్కార్ నేర్చుకోవాలి. లోపాలను గుర్తించాలి. నాలాల ఆక్రమణ తొలగించాలి. డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. అప్పుడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన డ్రైనేజీ వ్యవస్థే అటూ ఇటుగా ఇప్పటికీ కొనసాగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. ఎంతటి వరదైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలి. బెంగళూరు పరిణామం నుంచి హైదరాబాద్ కచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
వరదలు వచ్చిన ప్రతీసారి ఆ వరదల్లో రాజకీయం కనిపిస్తుంటుంది. రాజకీయ నాయకులకు ఇది ఆయుధం కాదు. పోరాడాల్సిన విషయం. కేంద్రం, రాష్ట్రం అని తేడా లేకుండా పరిష్కారం చూపించాల్సిన అంశం. ఇప్పటికైనా మెట్రో నగరాలను కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయకపోతే భవిష్యత్ తరాల బతుకులు ఆగం అవుతాయి. అర్బన్ సిటీ ప్లానింగ్ విషయంలో సంస్కరణలు తీసుకురావాలి. వరదను అడ్డుకునేలా చేసే వారిని అడ్డుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.