Bengaluru Floods : బెంగళూరులో వరదలకు కారణం సంపన్నులు, బడా కంపెనీలే..! అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వెలుగులోకి సంచలన నిజాలు

బెంగళూరులో వరదల దుస్థితికి అసలు కారణం సంపన్నులే అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విప్రో, ప్రిస్టేజ్, ఎకో స్పేస్, బ్యాగ్ మనె టెక్ పార్క్, కొలంబియా ఏసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఆక్రమణదారుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.

Bengaluru Floods : బెంగళూరును కనీవిని ఎరుగని వరదలు ముంచెత్తడానికి కారణం అక్రమ నిర్మాణాలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు, డ్రైనేజీ నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడమే. ఏ పెద్ద నగరాన్ని వరదలు ముంచెత్తినా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటం సహజం. కానీ, ఈసారి బెంగళూరు వరదల్లో పెద్ద సంఖ్యలో సంపన్నులు కూడా అష్టకష్టాలు పడ్డారు. వారిలో విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, స్టార్టప్ లతో సంపద పోగేసుకున్న బైజూస్ రవీంద్రన్, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి వంటి వారు ఉన్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

వరద కష్టాలు కళ్లారా చూసిన ప్రభుత్వ యంత్రాంగం.. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది. అక్రమ నిర్మాణలను కూల్చేసే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, నిన్న బెంగళూరులో జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతతో సంచలన నిజాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. వరదల దుస్థితికి అసలు కారణం సంపన్నులే అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

హై ప్రొఫైల్ బిల్డర్లు, డెవలపర్స్, టెక్ పార్క్ ల సృష్టికర్తలు 700లకు పైగా నాలాలు ఆక్రమించడమే తాజా వరదలకు కారణం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. విప్రో, ప్రిస్టేజ్, ఎకో స్పేస్, బ్యాగ్ మనె టెక్ పార్క్, కొలంబియా ఏసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఆక్రమణదారుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.

అయితే బుల్డోజర్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కూల్చివేతలు ఇంకా ఈ బడా నిర్మాణల దాకా రాలేదని, సాధారణ ప్రజల అక్రమ నిర్మాణలే కూల్చివేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు కూల్చివేతల అంశం రాజకీయ రంగు పులుముకుంది. సర్కార్ పై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా కూల్చివేతలు సాగుతున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. వరదల విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ హారిస్ నలాపడ్ కు చెందిన అకాడెమీలో నిర్మాణాలు కూల్చివేయడం సంచలనం రేపింది.