రైల్వే స్టేషన్ లో ‘టచ్‌ ఫ్రీ హ్యాండ్‌ వాష్‌’

  • Publish Date - August 15, 2020 / 12:56 PM IST

కరోనా వైరస్ మనుషుల జీవితాల్లోనే కాదు ప్రజలకు అంత్యంత ఉపయోగకరమైన వ్యవస్థల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చింది. మాస్కులు..శానిటైజర్లు మనుషుల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. గడపదాటితే చాలు ముఖానికి మాస్కు..చేతిలో శానిటైజర్ తప్పనిసరి అయిపోయింది. ఎంతగా అంటే ‘కరోనాకు ముందు – కరోనాకు తర్వాత పరిస్థితి’ అన్నట్లుగా మారిపోయింది. కరోనా తెచ్చిన కొత్త అలవాట్లతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.



ఈ క్రమంలో భారత రైల్వే ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఆలోచన చేసింది. రైల్వే స్టేషన్లలో చేతులు శుభ్రం చేసుకునేందుకు ట్యాప్‌కి బదులుగా తాకనవసరం లేని ‘టచ్‌ ఫ్రీ హ్యాండ్‌ వాష్‌’ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ముందుగా బెంగళూరులోని కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. దీనికి సంబంధించిన ఫోటోలను భారతీయ రైల్వే ట్వీట్ చేసింది.



కాలి గుర్తులు ఉన్నచోట కాలితో ప్రెస్‌ చేస్తే..ఒక ట్యాప్‌లో లిక్విడ్‌ సోప్‌, మరో ట్యాప్‌లో నీళ్లు వచ్చేలా వీటిని తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఇటువంటి ‘టచ్‌ ఫ్రీ హ్యాండ్‌ వాష్‌’ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ‘టచ్‌ ఫ్రీ హ్యాండ్‌ వాష్‌’కు ‘మన భద్రత మన చేతుల్లోనే ఉంది’ అనే సూచనను కూడా పెట్టారు. భారతీయ రైల్వే తీసుకువచ్చిన ఈ విధానంపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.వీలైనంత తొందరగా ఇలాంటివి దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.